దుండిగల్, ఫిబ్రవరి 3 :దేవాలయానికి వచ్చి ఇంటికి వెళ్తున్న వృద్ధురాలి మెడలోనుంచి 2.5తులాల బంగారు గొలుసును అపహరించిన నిందితుడిని బాచుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బంగారు గొలుసుతో పాటు ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంకు చెందిన వెంకటరమణ కొడుకు సావన మనోజ్‌కుమార్(26) నగరానికి గతకొన్నేండ్ల కిందట వలస వచ్చి, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్‌లోని లేక్‌వ్యూ కాలనీలో నివాసముంటున్నాడు. 2020లో ఏంబీఏ పూర్తిచేసిన అనంతరం మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా మనోజ్‌కుమార్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకున్నాడు. పలువురి దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నాడు. ఈ క్రమంలో గతనెల(జనవరి 31)వ తేదీన నిజాంపేట, శ్రీనివాస్‌నగర్ కాలనీలోని సిరిబాలాజీ రెసిడెన్స్ అపార్ట్మెంట్లోని రెండవ ఫ్లోర్లో నివాసముంటున్న స్వర్ణలత సాయిబాబా ఆలయంలో మధ్యాహ్నం హారతి తీసుకొని ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న క్రమంలో మాటలు కలిపాడు. స్వర్ణలత తన అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌ఎక్కి పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా మనోజ్‌కుమార్ ఆమె మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను జల్లెడపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.