దుండిగల్,జూన్9: బాచుపల్లి ఫ్లై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు తప్ప,కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్, కేపీ వివేకానంద్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే వివేకానంద్ బాచుపల్లి ైప్లెఓవర్ను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తూ తామోదో చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బాచుపల్లి ైప్లె ఓవర్ నిర్మాణంతో పాటు మహానగరాన్ని అభివృద్ధి పరిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య దోరణిని, అలసత్వాన్ని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రశ్నించినందునే ైఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.
తాము ప్రభుత్వంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన కొట్లాడి అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు హెచ్-సిటీ అంటూ పేరు మార్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు కొంపలి-సుచిత్ర ైప్లె ఓవర్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని మోపి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తన ఊహలనగరమైన ఫోర్త్‌సిటీని ప్రచారం చేస్తూ ఉన్ననగరాన్ని సీఎం విస్మరిస్తున్నాడన్నారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ మహానగర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి బాచుపల్లి ఫ్లైఓవర్‌ను మియాపూర్ నుంచి వర్చ్యూవల్‌గా ప్రారంభించడం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలను అవమానించడమేనని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. అంత ఆఘమేగాల మీద ఫ్లై ఓవర్‌ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో తెలియడం లేదన్నారు. మియాపూర్ వరకు వచ్చిన ఆయన బాచుపల్లికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.ఇది కచ్చితంగా నియోజకవర్గం ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు రంగరాయప్రసాద్తో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు,మహిళా నేతలు పాల్గొన్నారు.