అమీర్‌పేట్, జూలై 11: వృద్ధాప్యంలో తమ బాగోగులు చూస్తారనే నమ్మంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట చేస్తున్న గిఫ్ట్ డీడ్లు (Gift Deed) చాలా వరకు దుర్వినియోగమవుతున్నాయని, ఈ క్రమంలో తమ పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను రద్దు చేసుకునే వీలు తల్లిదండ్రులకు ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికార యంత్రాంగం చొరవ లోపించిందని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డీ. పార్థసారధి అన్నారు. గురువారం ఎస్ఆర్ నగర్‌లోని వయోధికుల సంక్షేమ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తమను నిరాదరణకు గురిచేస్తే.. తాము ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను ఏ క్షణంలోనైనా రద్దు చేసుకునే హక్కును గిఫ్ట్ డీడ్ చట్టంలోని సెక్షన్ 23 (1) వయోధికులకలు కల్పించిందని, అయితే ఈ విషయంలో సాక్షాత్తు సబ్‌రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్లు, డాక్యుమెంటరీ రైటర్లకే అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు.
తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007లోని ‘సెక్షన్ 23 షరతు’ను విధించేలా పాలకులు, పరిపాలనా యాంత్రాంగం దృష్టి సారిస్తే బాగుంటుందని తెలిపారు. అయితే గిఫ్ట్ డీడ్ చట్టం 1958 ప్రకారం గిఫ్ట్ డీడ్ ఇవ్వడానికి ఎలాంటి షరతులు ఉండకూడదని సూచిస్తున్నప్పటికీ, 2007లోని సెక్షన్ (3) ప్రకారం వయోధికుల చట్టమే అన్నిటికంటే ముఖ్యమైనది కావడంతో, తల్లిదండ్రులు తమ పిల్లలకు గిఫ్ట్ డీడ్ ఇచ్చే సమయంలో సెక్షన్ 23లోని షరతును అందులో నమోదు చేయడం గిఫ్ట్ ట్యాక్స్ ప్రకారం తప్పుకాదన్నారు. గిఫ్ట్ డీడ్ని సెక్షన్ 23 (1) ప్రకారం ముఖ్యంగా రాయవలసిన షరతు ఏమిటంటే.. ‘ఈ బహుమతి, తమను పిల్లలు కడతేర్చాలనే నియమంపై ఇస్తున్నాం.. ఈ నియమాన్ని పిల్లలు ఉల్లంఘిస్తే, ఈ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోబడును అంటూ రాయడం వల్ల వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భరోసా కల్పించేదిగా ఉంటుందని, గతంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఈ షరతు గిఫ్ట్ డీడ్లలో కచ్చితంగా ఉండాల్సిందేనని, లేని పక్షంలో కోర్టు దృష్టికి వచ్చిన సందర్భాల్లో నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రుల పక్షాన తాము ఆయా గిఫ్ట్ డీడ్లను రద్దు చేయలేమనే తీర్పులు వెలువరించాయని’ పార్థసారధి గుర్తు చేశారు.
అయితే ఈ సమస్యను నిబంధనలకు లోబడి పరిష్కరించే దిశగా పాలకులు, జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్లకు లేఖల ద్వారా, త్రైమాసిన సమావేశాల ద్వారా వయోధికుల సమస్యలపై చర్చించే ప్రతి వేదిక ద్వారా ఈ గిఫ్ట్ డీడ్‌లోని సెక్షన్ 23 (1)పై అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల ఎంతో మంది వృద్ధులు వీధిన పడకుండా నిలువరించే వీలుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి వయోధికులకు అన్యాయం జరిగితే గిఫ్ట్ డీడ్లు రద్దు చేయగలరనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.