MLRIT | దుండిగల్, డిసెంబర్ 5: ప్రతి సంవత్సరం 90 మందిని అఖిల భారత ఉద్యోగాలకు సంబంధించి శిక్షణను అందించేలా ‘తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ’ దిన పత్రికలు పూనుకున్నాయి. నగర శివారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్‌లోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో గురువారం ‘తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ’ దిన పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో ‘సివిల్ సర్వీసెస్ – ది గోట్ కెరియర్ ఫర్ ఏ ఫ్రెష్ గ్రాడ్యుయేట్’ పేరిట సెమినార్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2014 యూపీఎస్సీ విజేత, రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ జి.వివేకానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూపీఎస్సీ ప్రక్రియను, పరీక్షను ఎదుర్కొనే విధి విధానాలు, విజయాన్ని సాధించే మార్గములను, విలువైన సూచనలు అందజేశారు.
సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని, తమ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ లక్ష్యం ప్రతి సంవత్సరం 90 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారిని పరీక్షకు సిద్ధం చేయడం, 2030వ సంవత్సరం నాటికి 100 మంది ఐఏఎస్, 100 మంది ఐపీఎస్ అధికారులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, శ్రీరమణ ముప్పాళ్ల యూపీఎస్సీ పరీక్షా ప్రక్రియను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తూ, విద్యార్థుల విజయానికి ఒక రోడ్ మ్యాప్ సూచించారు.
ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రతినిధుల సమక్షంలో, రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ రూపొందించిన ప్రత్యేక యూపీఎస్సీ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ పుస్తకాలను విద్యార్థుల కోసం గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, డా. కె.శ్రీనివాస రావు, పీఆర్వో డా. వై.రఘునాథ్, హెచ్ఓడీ డా. కె.ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికల ద్వారా ఏర్పాటు చేసిన ఈ సెషన్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉందని, ఈ సెమినార్ నిర్వహణతో తమ కళాశాల విద్యార్థులు సివిల్ సర్వీసెస్‌లో ర్యాంకులు సాధించడానికి ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.