కవాడిగూడ, జూన్ 28: ప్రగతిశీల చట్టం ఉన్నప్పటికీ మహిళలు సామాజిక, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవిదేవి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదులు ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రామకృష్ణ మఠంలోని స్వామి వివేకానందద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్సీలో తెలంగాణ న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో శనివారం ‘మహిళా సాధికారత రాజ్యాంగ బాధ్యత’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, తెలంగాణ న్యాయవాద పరిషత్ ఉపాధ్యక్షురాలు పి.లక్ష్మితో కలిసి మాధవిదేవి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. జస్టిస్ మాధవిదేవి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అవుతున్నప్పటికీ నేటికీ అనేక మంది మహిళలు గృహ హింసకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రానికి ముందు నేటి సమకాలీన కాలం వరకు మహిళా కేంద్రీకృత చట్టాల పరిణామాన్ని ఆమె వివరించారు.
మహిళా న్యాయవాదులందరూ ఈ చట్టాలన్నింటిపైనా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో తెలంగాణ న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు ఎల్ ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జీ సంపద కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి సునీల్, కార్యదర్శి కవితాయాదవ్, కోషాధికారి మాఫియోసో, హైరోర్టు అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు, వాకిటి రామకృష్ణారెడ్డి, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.