కంటోన్మెంట్/కందుకూరు, డిసెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నదని నగర ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆటో సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీశైలం జాతీయ రహదారిపై తెలంగాణ ఆటోస్ ప్యాసింజర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో శనివారం నిరసన ర్యాలీని నిర్వహించి రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల ఉదయ్ ముదిరాజ్, మహేందర్ మాట్లాడుతూ… ఆటో డ్రైవర్ల కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రోజుకు రూ. 500 ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రూ. 100 కూడా రావడం లేదని వాపోయారు.
కుటుంబ పోషణ, ఆటో ఫైనాన్స్ ఎలా తీర్చాలో తెలియడం లేదన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రాజు, మహేందర్, అశోక్, వెంకటేశ్, పాండు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే న్యూ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న దర్గా హజ్రత్ సయ్యద్ మిస్కీన్ షా ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. తాము డిగ్రీలు చదువుకున్నా.. ఉద్యోగాలు దొరక్క ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని దర్గా హజ్రత్ సయ్యద్ మిస్కీన్ షా ఆటో స్టాండ్ అధ్యక్షుడు అలీం అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించడం ద్వారా మహిళలు సంతోషంగా ఉన్నా.. ఆటో డ్రైవర్ల కుటుంబాల మహిళలు ఏ మాత్రం సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, ప్రతినెల జీవన భృతి 10వేలు, ప్రతి ఆటో డ్రైవర్‌కు జీవిత బీమా 5 లక్షలు పాలసీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. సర్కారు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.