బంజారాహిల్స్,మార్చి 17: రాంగ్రూట్లో వచ్చి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన వారిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 13లో నివాసం ఉంటున్న రాఘవేంద్ర అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. ఈనెల 15న అర్దరాత్రి దాటిన తర్వాత మాదాపూర్‌లో సెకండ్ షో సినిమా చూసి బైక్‌మీద ఇంటికి బయలుదేరాడు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45నుంచి బాలకృష్ణ ఇంటివద్ద కుడివైపునకు తిరిగే సమయంలో రాంగ్రూట్లో వచ్చిన ఆటో బైక్‌ను ఢీ కొట్టింది. ఆటోడ్రైవర్‌ను రాఘవేంద్ర ప్రశ్నించాడు. దీంతో ఆటోడ్రైవర్ బూతులు తిట్టడంతో పాటు బైక్‌ను ఫాలో చేస్తూ కొంతదూరం వెంబడించి ఆటోను అడ్డుపెట్టారు. రాడ్‌తో దాడి చేసి కేసు పెడ్తానంటూ బెదిరించి రూ.5వేలు వసూలు చేశాడు. అతడితో పాటు మరో వ్యక్తి జుబైర్ రాఘవేంద్రకు సాయం చేస్తున్నట్లు నటించి మరో రూ.1000 వసూలు చేశాడు. బాధితుడు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఆటోడ్రైవర్ వీరప్ప నాయక్‌కు జుబైర్ స్నేహితుడు అని తేలింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.