సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు సర్కారు ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవీ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతుందని.. అందుకు తగినట్టు ఈవీ ఆటోలను కొనుగోలకు అందుబాటులో ఉంచడం లేదని వాపోతున్నారు. ఇతర టూ వీలర్, ఫోర్ వీలర్లలో సుమారు 20 శాతం రాయితీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈవీ ఆటోలకు మాత్రం ఎందుకు రాయితీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ ఇంధనం కొరత వేధిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు బతకాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఈవీ ఆటో కొనుగోలు చేయాలంటే ఇతర పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆటోలకంటే అధికంగా ధర పలుకుతున్నాయని పేర్కొన్నారు. సుమారు 3 నుంచి 4.5లక్షల వరకు ఈవీ ఆటో ధర ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఇందులో నగరంలో 1.10 లక్షల ఆటోలున్నాయి. కానీ చాలా మంది డ్రైవర్లకు తాము నడిపే వాహనాలు సొంతంగా లేవు. అద్దెకు మాత్రమే నడుపుతున్నారు. ఆ ఆటోలన్నీ ఫైనాన్షియర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఈవీ ఆటోలపై రాయితీ కల్పించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
ఈవీ ఆటో ధరలు రూ.4 లక్షల వరకు ఉన్నాయి. వాటిపై రాయితీ ఇవ్వాలి. ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఉచిత బస్సుతో ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నది. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. షోరూంలు ఆటోల కొనుగోలులో అక్రమాలకు పాల్పడుతున్నాయి. వాటిపైన చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియర్లు ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయాలి.
-రవి శంకర్, ఆటో యూనియన్ నాయకుడు
కొనుగోలును ప్రోత్సహించాలి
ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలును ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించడం లేదు? ఈవీ ఆటోలకు రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం వెంటనే ఈవీ ఆటోల ధరలు తగ్గించి ఆటో డ్రైవర్లకు అందించాలి. ఈవీ ఆటోలను కొనుగోలు చేయాలంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం అవకాశం కల్పించాలి.
– సత్తిరెడ్డి, టీఏడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి