Hyderabad | బంజారాహిల్స్,ఏప్రిల్ 28: దూరపు బంధువు కదా అని పలకరిస్తే ఇష్టపడుతున్నానని వెంటపడ్డాడో ఓ కామాంధుడు. పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వదలకుండా తనతో గడపాలని వేధించాడు. తన కోరిక తీర్చకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. రోజురోజుకీ ఈ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వివాహిత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో ఓ వివాహిత(26) ఆమె భర్త ఇద్దరి పిల్లలతో జీవిస్తోంది. స్థానికంగా ఒక షాప్‌లో హౌజ్ కీపర్‌గా పనిచేస్తుంది. సదరు వివాహిత భర్తకు దూరపు బంధువయ్యే నవీన్ కూడా ఆటో నడుపుకుంటూ వీరికి దగ్గరలోనే ఉంటాడు. అప్పుడప్పుడు వివాహిత ఇంటికొచ్చేవాడు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడే నవీన్.. కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అతని ప్రవర్తన చూసి.. భర్తకు నవీన్ గురించి మొత్తం చెప్పేసింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని చెప్పింది. అతడిని దూరం పెట్టింది. అది జీర్ణించుకోలేని నవీన్.. ఆమె గురించి తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టాడు.
ఆ వివాహిత క్యారెక్టర్ మంచిది కాదని.. కలిసిన వాళ్లందరికీ చెబుతూ నవీన్ ఆమెను బ్యాడ్ చేయడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే నరకం చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వివాహిత పనిచేస్తున్న షాప్ వద్దకు వెళ్లిన నవీన్ వీరంగం సృష్టించాడు. తన కోరిక తీర్చకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఇలా రోజురోజుకీ నవీన్ వేధింపులు ఎక్కువవుతుండటంతో తాళలేక.. సదరు వివాహిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నవీన్‌పై బీఎన్ఎస్ 75(1),78(2), 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.