Banjarahills | బంజారాహిల్స్, మార్చి 5 : బంజారాహిల్స్ రోడ్ నెం-11లోని అంబేద్కర్‌నగర్ బస్తీని అనుకుని ఉన్న నాలా పక్కన ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. షేక్‌పేట మండలంలోనివార్డ్ 11, బ్లాక్ -ఆర్, టీఎస్ నెంబర్ -4లో నాలా స్థలంగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న సుమారు 1500 గజాల ఖాళీ స్థలంపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. పదిరోజులుగా స్థలాన్ని చదును చేస్తున్నారు.
దీనిలో భాగంగా మంగళవారం రాత్రి అక్రమంగా ట్రిప్పర్లతో మట్టిని తీసుకువచ్చి స్థలంలో నింపుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదుతో ట్రిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి స్పందించి తమ సిబ్బందిని స్థలం వద్దకు పంపించారు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయించారు. ప్రైవేటు వ్యక్తులు స్థలంలోకి వస్తే క్రిమినల్ కేసు నమోదు చేయిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.