ఖైరతాబాద్, జూన్ 12 : నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిమ్స్ దవాఖాన ప్రాంగణంలో నూతన భవనాల నిర్మాణం జరుగుతుంది. అదే సైటులో ఓ కుటుంబం నిర్మాణ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఓ వ్యక్తి బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించి వారు ఉంటున్న గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నాడు.
ఆ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికదాడికి యత్నించాడు. దీంతో బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి తలుపులు కొట్టగా వెంటనే తెరిచి అక్కడ నుంచి పరారయ్యాడు. లైంగికదాడికి యత్నించిన వ్యక్తి శంభు బండారిగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.