బంజారాహిల్స్, డిసెంబర్ 13: షేక్‌పేట మండల పరిధిలో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ.350 కోట్ల విలువైన స్థలాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది కబ్జాదారుల నుంచి కాపాడారు. అధికారుల కథనం ప్రకారం.. షేక్‌పేట మండలం, జూబ్లీహిల్స్ రోడ్‌నం. 70 సమీపంలోని దేవరకొండనగర్ బస్తీని ఆనుకుని ఉన్న సర్వేనంబర్ 403 లోని టీఎస్ నం -1, బ్లాక్ ఎఫ్, వార్డు -9లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. గత ప్రభుత్వాల హయాంలో ఇతర సంస్థలకు కేటాయించగా.. వాటిని సకాలంలో ఉపయోగించుకోవడంలో ఆయా సంస్థలు విఫలమయ్యాయి.
దీంతో ఈ స్థలాన్ని వెనక్కి తీసుకుని ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచారు. ఈ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ స్థలంపై కన్నేసిన కొంతమంది వ్యక్తులు గత కొన్నేళ్లుగా బోగస్ పత్రాలు సృష్టించి సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు పక్కా ప్రణాళిక వేసుకున్నారు. దీనిలో భాగంగా కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి గుడిసెలు వేయించడంతో పాటు స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. సమాచారం అందుకున్న షేక్‌పేట మండలం తాసీల్దార్ అనితారెడ్డి రంగంలోకి దిగి.. జేసీబీల సాయంతో ఆక్రమణలను తొలగించారు. ఈ స్థలంలో గుడిసెలు వేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని తాసీల్దార్ హెచ్చరించారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జలమండలి తట్టిఖానా సెక్షన్‌ను ఆనుకుని ఉన్న సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల జలమండలి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం కేటాయించింది. కాగా, గత పది రోజులుగా కొంతమంది వ్యక్తులు ఈ స్థలం తమదంటూ బోగస్ పత్రాలు తయారు చేసి ఆక్రమణలకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఈ స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడంతో జలమండలి అధికారులు షేక్‌పేట మండల తాసీల్దార్ అనితారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు. ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టేవారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ స్థలం విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, జూబ్లీహిల్స్ రోడ్ నం. 70, దేవరకొండనగర్ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని అభిషేక్ ఆవ్లా, మరికొందరితో కలిసి కబ్జాకు యత్నించారు. షేక్‌పేట్ తాసీల్దార్ అనితా రెడ్డి దృష్టికి రాగా, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై 447, 427 సెంక్షన్ల కింద కేసు నమోదు చేశారు.