బంజారాహిల్స్,సెప్టెంబర్ 2: బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రైవేటు వ్యక్తులు మరోసారి విఫలయత్నం చేశారు. ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న పార్థసారథి, విజయ్ భార్గవ్ అనే వ్యక్తులపై షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదు కాగా తాజాగా మరో రెండు గ్రూపులకు వ్యక్తులు ప్రభుత్వ స్థలంలోకి ప్రవేశించి గొడవలకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403/పీ, టీఎస్ నంబర్ 1/పార్ట్, బ్లాక్ హెచ్, వార్డు-10లోని 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎకరన్నర స్థలాన్ని జలమండలి కోసం కేటాయించగా, మరో మూడున్నర ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. సుమారు రూ.400 కోట్ల విలువైన ఈ స్థలం సర్వే నంబర్ 403/52 నంబర్‌లోకి వస్తుందని, దీన్ని తాము కొనుగోలు చేశామంటూ ఎన్నో ఏండ్లుగా పరుశరామ్ పార్థసారథి, ఆయన కొడుకు విజయ్‌భార్గవ్ వాదిస్తున్నారు.
అయితే వారు చెబుతున్న సర్వేనంబర్ నాన్ ఎగ్జిస్టింగ్ నంబర్ అని క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్థలంతో వారికి ఎలాంటి సంబంధం లేదంటూ రెవెన్యూ, జలమండలి అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్థలంలోకి ప్రవేశించిన పార్థసారథితో పాటు అయన కొడుకు, ఇతర వ్యక్తులపై షేక్‌పేట మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలోనే బంజారాహిల్స్ పీఎస్‌లో మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో రెండు నెలల కిందట వీఆర్ ఇన్ఫ్రా పేరుతో పార్థసారథి కొడుకు విజయ్‌భార్గవ్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. స్థలం యజమానులు మేర్ల నారాయణ, నూకల రాఘవరావు తదితరులు తనకు స్థలాన్ని డెవలప్మెంట్కు ఇచ్చారంటూ వేర్వేరుగా రెండు స్టేలు తెచ్చాడు. దీంతో స్టేలు ఎత్తేయాలంటూ షేక్‌పేట మండల అధికారులు కోర్టును ఆశ్రయించగా కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాసాగర్ అనే వ్యక్తి నుంచి తాము స్థలాన్ని కొనుగోలు చేశామంటూ, కింగ్డమ్ రియల్ ఎస్టేట్ ఎల్ఎల్పీ సంస్థకు డెవలప్మెంట్ ఇచ్చారంటూ కొంతమంది వ్యక్తులు ఆదివారం స్థలంలోకి ప్రవేశించారు.
దీంతో అప్పటికే స్థలంపై కోర్టుల్లో స్టే తెచ్చుకున్న వీఆర్ ఇన్ఫ్రాకు చెందిన వ్యక్తులు సైతం అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించడంతో పాటు తమ సంస్థల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సుమారు 10గంటల పాటు కొనసాగిన హైడ్రామా అనంతరం బంజారాహిల్స్ పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. కొంతమంది వ్యక్తులను పీఎస్‌కు తీసుకువెళ్లారు.
తాము సైట్లో ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు రాడ్లతో దాడి చేశారంటూ వి. తేజ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అకాశ్ అనే యువకుడితో పాటు ఇతర వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా ఈ స్థలం ఆక్రమణలకు అనేకసార్లు ప్రయత్నాలు జరుగుతుండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆరోపణలు వినిపిస్తుండడంతో వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ మంగళవారం బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
స్థలంలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న జలమండలి విజిలెన్స్ విభాగం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రైవేటు వ్యక్తులు స్థలంలోకి ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కాగా, మంగళవారం షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన బోర్డులను .. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని, ప్రైవేటు వ్యక్తులు స్థలంలోకి ప్రవేశించేందుకు యత్నించగా తమ సిబ్బంది అడ్డుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు.