బంజారాహిల్స్, డిసెంబర్ 10: సుమారు 15ఏళ్లుగా రెవెన్యూశాఖ ల్యాండ్ బ్యాంక్‌లో ఉన్న స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చి షెట్టర్లు నిర్మిస్తున్న ఘటన ఫిలింనగర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నంబర్ 102/1పీ, టీఎస్ నెం 7, బ్లాక్-ఏ, వార్డు-12లో ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్ బస్తీలో సుమారు 260 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని తమకు జీవో 166 కింద క్రమబద్దీకరణ చేయాలంటూ 2008లో బస్తీనేత సైదప్ప తన భార్య కే.సీతమ్మ, కుటుంబ సభ్యులైన జి.పద్మ, కే.సత్యవతి, కే.జానకి, కే.వాణి తదితరుల పేర్లతో అప్పటి రెవెన్యూశాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే వారు నివాసం ఉంటున్నట్లు సమర్పించిన కరెంట్ బిల్లు గౌతమ్‌నగర్ ప్రాంతానికి చెందిన సైదప్ప ఇంటిదని, స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో క్రమబద్ధీకరణ చేయడం కుదరదని 2012లో అధికారులు తిరస్కరించారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించిన అధికారులు.. ఆ స్థలం ప్రభుత్వానిదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో సైదప్ప కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది.
ఇటీవల నిర్మాణాలకు యత్నం..
కాగా ఇటీవల స్థలంలోకి ప్రవేశించడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తొలగించిన సైదప్ప కుటుంబసభ్యులు నిర్మాణాలకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో సైదప్ప కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా స్టే మంజూరు చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల సైదప్ప కుటుంబ సభ్యులు కోర్టుకు సమర్పించిన పత్రాలను పరిశీలించగా భారీ మోసం బయటపడింది. సైదప్ప భార్య సీతమ్మతో పాటు మరో ముగ్గురి పేర్లతో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ కనెక్షన్లు దుర్గాభవానీనగర్‌కు చెందిన ఇంటి నంబర్లుగా తేల్చారు. దుర్గాభవానీగర్లో వేరే వ్యక్తుల పేర్లతో ఉన్న ఇంటి నంబర్లు ఉపయోగించుకుని పక్కనున్న దీన్ దయాళ్‌నగర్ బస్తీలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నట్లు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు గుర్తించారు.
అధికారులతో దురుసు ప్రవర్తన..
సంబంధిత స్థలంలో రాత్రికి రాత్రే షెట్టర్లతో షాపులు నిర్మిస్తుండటంతో బుధవారం షేక్‌పేట రెవెన్యూ అధికారులు అడ్డున్నారు. అయితే తనకు స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకోమని చెప్పాడని, కోర్టులో ఆర్డర్ ఉందంటూ బస్తీనేత సైదప్ప రెవెన్యూ అధికారులను దబాయించడంతో పాటు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు.