కీసర, జూన్ 6: కీసర సర్కిల్లో భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వ భూమి అయినా, ప్రైవేటు భూమి అయినా మింగేస్తున్నారు. ఈ క్రమంలోనే చీర్యాల్ గ్రామంలో ఒక వ్యక్తి గుండాలతో కలిసి ఒక రైతుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు యత్నించడమే కాకుండా అడ్డువచ్చిన భార్యాభర్తలపై విచక్షణరహితంగా దాడులు చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండా పోయిందని, పోలీసులు భు కబ్జాదారుడితో కుమ్మక్కై వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కథనం ప్రకారం… కీసర సర్కిల్, చీర్యాల్ గ్రామానికి చెందిన కోల రమేశ్, పారిజాతం దంపతులకు అదే గ్రామంలోని సర్వేనెంబర్ 156లో 1 ఎకరా, 37 గుంటల భూమి ఉంది. వీరి భూమి పక్కనే నగరానికి చెందిన పల్లె భద్రారెడ్డికి కూడా కొంత భూమి ఉంది. అయితే గత కొంతకాలంగా భద్రారెడ్డి తన భూమికి ఆనుకుని ఉన్న భూమి కూడా తనదేనంటూ పలుమార్లు కోల రమేష్ కుటుంబంపై దాడులకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. దీనిపై గతంలోనూ చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, గతంలో ఓసారి తమ భూమిలోని కంటైనర్‌లో నిద్రిస్తున్న తమ కుటుంబ సభ్యుడిపై పెట్రోల్ పోసి, చితకబాధినట్లు బాధితులు వాపోయారు.
2025లో కూడా భద్రారెడ్డి తమ భూమిని కబ్జాచేసేందుకు యత్నించడమే కాకుండా తమపై దాడులకు పాల్పడితే తాము అప్పటి రాచకొండ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై స్పంధించిన సీపీ ఎవరి భూమిలో వారు ఉండాలని, ఇరువురిని ఆదేశించినట్లు బాధితులు తెలిపారు. దీంతో కొద్ది రోజులు మిన్నకుండా ఉన్న భద్రారెడ్డి మళ్లీ గత కొన్ని రోజులుగా తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నించడమే కాకుండా తమపై దాడులకు పాల్పడుతూ తమను చంపుతామంటూ బెదిరిస్తున్నాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి సుమారు 50మంది గూండాలతో కలిసి భద్రారెడ్డి తమపై దాడిచేసినట్లు రమేష్, పారిజాతం దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే తమపై దాడిచేసిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్థానిక పోలీసులు భూ కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని భూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పోలీసులు స్పంధించి, భద్రారెడ్డి, అతడి అనుచరుల నుంచి తమను రక్షించాలని బాధితులు కోరుతున్నారు.