జూబ్లీహిల్స్,నవంబర్ 17: నగరంలోని ట్రాన్స్‌జెండర్ గ్రూపుల మధ్య జరిగిన వివాదంలో న్యాయం చేయాలంటూ పలువురు హిజ్రాలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన సోమవారం బోరబండలో చోటుచేసుకుంది. ఇటీవల ఒక బర్త్‌డే పార్టీలో ట్రాన్స్‌జెండర్స్ గ్రూపులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వివాదంపై ఒక గ్రూప్‌నకు లీడర్‌గా ఉన్న మోనాలిసా వద్దకు పలువురు హిజ్రాలు న్యాయం కోసం వెళ్ల్ళారు. అయితే మోనాలిసా వద్దకు న్యాయం కోసం వెళ్ళిన గ్రూప్ సభ్యులనే దూషించి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పలువురు హిజ్రాలు బోరబండ బస్టాండ్ కూడలిలో ఆందోళనకు దిగారు. ఈ వివాదంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు.
న్యాయం కోసం వెళితే దాడులు చేశారని.. మోనాలిసాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇందులో 10 మంది ట్రాన్స్జెండర్లు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం స్థానికులు, పోలీసులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. పెట్రోల్ పోసుకున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి.