బడంగ్‌పేట, ఆగస్టు 14: సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేటలో రూ.56 లక్షలతో ‘మన బస్తీ – మన బడి పథకం’ కింద అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలను ఖర్చుపెట్టి తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా వారికి విద్యతో పాటు, పౌష్టికాహారం అందజేస్తున్నదని పేర్కొన్నారు. గతంలో పాఠశాలలో వసతులు తక్కువగా ఉండేవని, ఈ నేపథ్యంలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వం బాటలు వేస్తున్నదన్నారు. మన బస్తీ – మన బడి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. మంచి వాతావరణం ఉండే విధంగా, పాఠశాల్లో ఫర్నిచర్, టాయిలెట్స్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రైవేట్ స్కూల్లో మాదిరిగా ప్రభుత్వ స్కూళ్లలో కూడా పేరెంట్స్ మీటింగ్‌లను ఉపాధ్యాయులు ఏర్పాటు చేస్తారన్నారు. చదువుపై దృష్టి పెడుతున్నారా? లేదా? క్రీడల మీద ఆసక్తి చూపుతున్నారా? వంటి విషయాలను మీటింగ్ రోజున తల్లిదండ్రులు వెళ్లి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు ఎలా చదువుతున్నది తెలుస్తున్నదన్నారు. దివ్యాంగుల బాల బాలికలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రూ.2 కోట్ల వ్యయంతో 8 వేల మందికి సహాయ పరికరాలను అందించడం జరుగుతుందన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని కోరారు. అనంతరం, దివ్యాంగ బాల బాలికలకు సహాయ పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.