మెహిదీపట్నం, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాల జాతర గురువారం ప్రారంభమవుతుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో తొలిపూజతో ఆషాఢ మాసం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాస బోనాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం ఉదయం లంగర్‌హౌస్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభిస్తారు. లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై బోనాలను ప్రారంభించి, చౌరస్తా వద్ద అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు.
అనంతరం అక్కడి నుంచి తొట్టెలను పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు. వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ రిసాల బజార్ నుంచి నజర్ బోనం ఊరేగింపు ఉంటుంది. గోల్కొండ బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని గోల్కొండ జోన్ డీసీపీ జె.రాఘవేందర్ రెడ్డి తెలిపారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో ప్రారంభమయ్యే బోనాల పూజ, ఊరేగింపు, తొట్టెల సమర్పణ జరిగే వరకు అదనపు బలగాలు, టాస్క్‌ఫోర్స్ బృందాలు, బాంబ్‌స్కాడ్, ఆశ్విక దళాలు, సీఆర్పీఎఫ్ బృందాలతో బందోబస్తు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బోనాల విజయవంతానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.