Asaduddin Owaisi | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తున్నది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌తో పాటు ప్రొ కబడ్డీ లీగ్ ఓనర్ అనుపమ, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్‌రావులతో పాటు పలువురి భవనాలను సైతం కూల్చివేసింది. ఇందులో పలువురు ఎంఐఎం నేతల భవనాలు సైతం ఉన్నాయి. ఈ అంశంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించి ప్రభుత్వ కార్యాలయాలను సైతం కూల్చివేస్తారా? అంటూ రేవంత్ రెడ్డి సర్కారును ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు.. ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూలుస్తారా? అంటూ నిలదశారు. నెక్లెస్ రోడ్ సైతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, జీహెచ్ఎంసీ సైతం నీటికుంటలో నిర్మించిందేనని.. నాలాపై కట్టిన కార్యాలయాన్ని సైతం కూల్చివేస్తారా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబి ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్దనే ఉందని.. అలాగే, నగర పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఎల్టీఎఫ్ పరిధిలోనే ఉన్నాయన్నారు. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉందని.. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సైతం గోల్ఫ్ ఆడుకుంటారని.. అక్కడికి వెళ్లి చూడాలని.. లేకపోతే ఫొటోలు కావాలంటే తానే ఇస్తానన్నారు. ఎల్టీఎఫ్ సమస్యపై నగర మేయర్‌ను కలిశామని.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూస్తానన్నారు. వక్ఫ్‌బోర్డుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతుందోని.. ముస్లింలను లేకుండా చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు. మజీద్లు, దర్గాల లాగే వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావన్న ఆయన.. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ఆస్తులకు డీడ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మక్కా మసీద్‌కు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలంటూ కేంద్రాన్ని నిలదీశారు.