సిటీ బ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ఎండల తీవ్రత పెరుగుతుండటంతో నగరంలో నీటి సమస్య తాండవిస్తున్నది. సరఫరా తగ్గడం, లోప్రెషర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీల్లో జలమండలి నీళ్లు సరిపోకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టింపు కరవవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి ట్యాంకర్లు నిరుపేదలకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ట్యాంకర్ బుక్ చేసుకుంటే గంటల వ్యవధిలో ఇంటికి నీటిని చేరుస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్లు గంటల తరబడిగా పదుల సంఖ్యలో వేచి ఉంటున్నాయి.
నీటి సమస్య ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి నెలకొన్నది. ఒక్కో ఫిల్లింగ్ స్టేషన్ ముందు సుమారు నాలుగు గంటల పాటు పడిగాపులు కాస్తున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లకు సరఫరా కావలసినంత జరగకపోవడంతో ట్యాంకర్లను సకాలంలో నింపలేకపోతున్నారు. ముఖ్యంగా నల్లగండ్ల, మసీద్‌బండ, రాయదుర్గం, హఫీస్‌పేట, మణికొండ తదితర ప్రాంతాల్లోని ఫిలింగ్ స్టేషన్లలో ట్యాంకర్ నీటిని నింపుకొని బయటకు వెళ్లేందుకు సుమారు 4 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
దీంతో అక్కడి ప్రజలకు ట్యాంకర్లు సకాలంలో అందడం లేదు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేద్దామంటే ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ఇదే అదనుగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇష్టారీతిన ధరలు పెంచి దోచుకుంటున్నారు. జలమండలి నీటి ట్యాంకర్ల కొరత ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులకు వరంగా మారుతున్నది. అధికారుల నిర్లక్ష్యం వారికి కాసులు కురిపిస్తున్నది. ఆయా ప్రాంతాల్లో జలమండలి ట్యాంకర్ల కంటే ప్రైవేట్‌వే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.
రెండు నుంచి మూడు రోజులు..
బస్తీలు, కాలనీల్లో జలమండలి నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో వినియోగదారుల దాహం తీరేందుకు రెండు నుంచి మూడు రోజులు సమయం పడుతున్నది. అటు సరఫరా సరిగ్గా లేకపోవడం.. ఇటు ట్యాంకర్లు సకాలంలో చేరుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండటం.. తాగునీటి కొరతతో అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్యాంకర్లు బుక్ చేసిన రెండు రోజుల తర్వాత వస్తున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా ఆసిఫ్‌నగర్, బుద్వేల్, ఎస్ఆర్ నగర్-2, చిలకలగూడ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి బుక్ చేసిన 48 గంటల తర్వాత వినియోగదారుడి ఇంటికి చేరుకుంటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ సమయం పడుతున్నది.
ఉచిత ట్యాంకర్లు సరఫరా చేసే ప్రాంతాల్లోనూ చాలినన్ని అందకపోవడంతో బిందెలతో మహిళలు యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బస్తీలు, కాలనీల్లో ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కుతున్నారు. జలమండలి కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. అలాంటి సమయాల్లో అధికారులు ఉరుకులు పరుగులతో హడావిడిగా ట్యాంకర్లను తెప్పించి.. మరుసటి రోజు నుంచి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారవుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారనున్నట్లు నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.