సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో భాగంగా ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ)ను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తున్న పోలీసులకు ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ వంటి కారణాలుగా తేలుతున్నాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు ఇతర ఉల్లంఘనలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి తరువాత ఇటీవల రోడ్డు ప్రమాదాలు శివారులలో ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడమే కారణమవుతున్నాయి.
ఈ ఉల్లంఘనలు పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడం కోసం ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ ప్రమాదాలు జరగడానికి కారణాలు విశ్లేషిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ రోడ్ల వల్ల ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో 99.9 శాతం మానవ తప్పిదాలే ఉంటున్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో మద్యం, వేగం రెండు వాహనదారుడి ప్రాణాలను తీసేస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు వాహనాల వేగానికి కళ్లేం వేసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నగరంలోకి రాత్రి 10 గంటల తరువాత భారీ వాహనాలకు అనుమతి ఉంటుంది. కాని 9 గంటలకే నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటిపై నగర ట్రాఫిక్ పోలీసులు గత నెలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే డ్రైవ్ నిర్వహించిన సమయంలో భారీ వాహనాలు 10 గంటల తరువాతే రోడ్లపైకి వచ్చాయి. డ్రైవ్ పూర్తి కాగానే తిరిగి రద్దీ వేళల్లోను నగరంలోకి ఏంట్రీ అవుతున్నాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని ఓ వైపు అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, కోర్టులో హాజరుపరుస్తున్నారు. న్యాయస్థానాలు వారికి జైలు శిక్షలు విధిస్తున్నాయి. దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తున్నారు.
F ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉల్లంఘనలు నమోదైన కేసులు
డ్రంక్ అండ్ డ్రైవ్ 13429
రాంగ్ సైడ్ డ్రైవింగ్ 63508
ట్రిపుల్ రైడింగ్ 51383