రంగారెడ్డి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఇప్పటివరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా.. తొలిసారిగా 18 ఏండ్లు పైబడిన వారికీ ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా.. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే దేశంలో తొలివిడుతగా ఎనిమిది రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ మొదలైంది. మలి విడుతలో రాష్ట్రంలో 17 జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఇందులో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు ఉన్నాయి. బీసీజీ వ్యాక్సినేషన్ కార్యాచరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో సోమవారం ప్రభుత్వ దవాఖానలకు చెందిన డాక్టర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు.
క్షయ వ్యాధి క్రమంగా విస్తరిస్తున్నది. వ్యాధి సోకినవారు సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా మందులు వాడితే నయం చేయవచ్చు. లేదంటే ఈ వ్యాధితో ప్రాణానికే ప్రమాదం. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ వ్యాధి కట్టడికి అనేక చర్యలు తీసుకుంటూ వస్తున్నది. తాజాగా.. కేంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్దేశానికి అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నది.
క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో 18 ఏండ్లు పైబడినవారికి బీసీజీ టీకాను ఇవ్వనున్నారు. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు ఒక డోసు టీకా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరెవరికి టీకా ఇవ్వాలని గుర్తించేందుకు ఆరు కేటగిరీలను నిర్దేశించుకుని ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానున్నది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి వివిధ స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బీసీజీ టీకా వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. పెద్దలలో టీబీ వ్యాధి నివారణ కోసం తయారైన బీసీజీ టీకా అధ్యయన కార్యక్రమంపై రంగారెడ్డి జిల్లాలోని కామినేని ఆసుపత్రి ఇందిరా ఆడిటోరియంలో పీహెచ్సీ, పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలకు చెందిన డాక్టర్లు, సూపర్ వైజర్లకు సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ 60 ఏండ్లు పైబడినవారందరికీ, బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్నవారు, మద్యం తాగేవారు, ఇప్పుడు పొగ తాగుతున్నవారి, గతంలో పొగతాగినవారు ఈ టీకా వేసుకునేందుకు అర్హులని అన్నారు. క్షయవ్యాధిగ్రస్తులకు సన్నిహితంగా ఉన్నవారు, గత ఐదేండ్లలో క్షయ వ్యాధిగ్రస్తులున్న ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు టీకా వేసుకోవచ్చునని సూచించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా క్షయనియంత్రణాధికారి డాక్టర్ అరుణ కుమారి, యూఎన్డీపీ, ఎన్పీఎస్పీ ప్రతినిధులు డాక్టర్ స్నేహ శుక్లా, డాక్టర్ సుమలత, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ స్వర్ణ కుమారి, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ గీత, డాక్టర్ వినోద్, డాక్టర్ అనిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంబిక తదితరులు పాల్గొన్నారు.