సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ‘100 రోజుల్లో మెట్రోరైల్ స్వాధీన ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రత్యేక కార్యాచరణతో ఎల్ అండ్ టీ నుంచి హస్తగతం చేసుకుంటాం’ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ చెప్పి న మాటలకు.. గడువు దగ్గరకొస్తుండడంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పొంత న లేకుండాపోతున్నది. మరో రెండు రోజు ల్లో ఈ ప్రక్రియకు విధించిన గడువు ముగియనున్నది. ఈ క్రమంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని సభా ముఖం గా స్పష్టం చేయలేదు.
ఎల్ అండ్ టీ నుంచి తెగతెంపుల గడువు ముంచుకొచ్చింది. కానీ నిధుల సర్దుబాటుపై ఇప్పటికీ సర్కార్ స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు. వంద రోజుల్లోనే స్వాధీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పిన సర్కార్… మరో 2రోజులే మిగిలి ఉన్నా కదలిక లేకుండా చోద్యం చూస్తున్నది. కేవలం అధికారిక నివేదికలు, అసెంబ్లీ వేదికగా తీర్మానాలకే పరిమితమైంది తప్ప.. ఆర్థిక వనరుల విషయంలో సర్కార్ లేవనెత్తిన అంశాలను ప్రకటించడంలేదు. స్వా ధీనం చేసుకుంటామని మాత్రం ప్రకటిం చింది. కనీసం ఎల్ అండ్ టీ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తుం దో ఇప్పటివరకు వెల్లడించలేదు.
నిధులుంటేనే స్వాధీనం..
ఎల్అండ్టీ సంస్థకు ఇచ్చే ఈక్విటీ మొత్తంతోపాటు, రుణాల రూపం లోనూ సర్దుబాటు చేస్తే గానీ మెట్రో స్వాధీన ప్రక్రియ పూర్తి కాదు. అయితే ఎల్అండ్టీకి తక్షణమే చెల్లించాల్సిన రూ. 2వేల కోట్లను సర్దుబాటు చేశారా? ఉన్న లోన్లను బదిలీ చేసుకుని, వాటికి వడ్డీలు చెల్లిస్తారా? లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఒకే మొత్తంలో లోన్లు తీసుకుని, దశల వారీగా చెల్లింపులు చేస్తారా? అనే విషయాలపై హైదరాబాద్ మెట్రో సంస్థ, సర్కార్ అధికారికంగా ప్రకటించలేదు. సర్కారు మాత్రం నిధుల కోసం ఏడీబీతోపాటు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) సంస్థలను ఆశ్రయించి విఫలమైంది.
ఈ క్రమంలో సర్కారు ముందుగా ఎల్అండ్టీ మొత్తాన్ని చెల్లించి, రూ. 13,000 కోట్ల రుణాలకు కొంత కాలంపాటు వడ్డీ చెల్లిస్తామని చెప్పినా స్వాధీనం వీలుపడేలా లేదు. ఖజానా ఖాళీగానే ఉం దనీ, సర్కారు చేతిలో చిల్లిగవ్వ లేదంటూ ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మెట్రో స్వాధీనం పేరిట సర్కారు నెత్తిన అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు స్వాధీన ప్రక్రియ కూడా అందుకు ప్రధాన ఉదాహరణగా నిలుస్తుంది. మెట్రో విస్తరణకు లింకు పెట్టిన సర్కారు, అటు స్వాధీనం చేయకుండా, ఇటు విస్తరణకు అవసరమైన అనుమతులు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన కూడా ఇదే తీరుగా దోబూచులాడుతుండగా… కనీసం ఈ ఏడాదిలోనైనా మెట్రో విస్తరణ, స్వాధీనానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది.