నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని కోరుతూ న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌పై శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరు వర్గాల వాదనలు విన్న 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జీ రమాకాంత్ 13కు తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 13 వరకు నిందితుడు కోర్టు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసింది. 13న వెలువడే తీర్పు అనంతరం నిందితుడు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని కోర్టు సూచించింది. వైద్య పరీక్షలు, వైద్యులందించే చికిత్స నిమిత్తం గడువును పెంచాలని వైద్య రిపోర్టులను కోర్టుకు సమర్పించారు.
ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు పూర్తి చేసిన వైద్యులు అందుకు కావాల్సిన చికిత్సను అందిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం అభ్యంతరం తెలిపారు. ఇప్పటివరకు మూడు సార్లు చికిత్సల కోసం గడువును పొడిగించడం జరిగిందని, సాక్షులను తారుమారు చేసే అవకాశాలున్నాయని కోర్టుకు వివరించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఐ-న్యూస్ ప్రతినిది శ్రావణ్‌కుమార్ విదేశాల్లో ఉన్నందున వారిపై కొనసాగుతున్న నాన్ బెయిలబుల్ వారెంట్‌పై అధికారులు చర్యలు చేపడుతున్నట్లు ఇటీవల పీపీ కోర్టుకు మెమో ద్వారా తెలిపారు. అమెరికాలో చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రావుకు అక్కడి పౌరసత్వం గ్రీన్‌కార్డు లభించిందని విశ్వసనీయ సమాచారం.