మేడ్చల్, అక్టోబర్ 19 : మద్యం మత్తులో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.. డబ్బుల కోసం నానమ్మ ను గోడకేసి బాది హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని రావల్కోల్ గ్రామానికి చెందిన బందెల బాలమ్మకు కొడుకు ఉన్నాడు. అతడికి కుమారుడు ప్రశాంత్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కాగా.. బాలమ్మ.. తనకు ఉన్న వ్యవసాయ భూమిని విక్రయించగా.. వచ్చిన డబ్బుతో ఇద్దరు మనువరాళ్ల పెండ్లికి సాయం చేసింది. అయితే మనువడు ప్రశాంత్ 10వ తరగతి వరకు చది వి.. చిన్నా, చితకా పనులు చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. మనవరాళ్లకు సాయం చేసినట్టు తనకు కూడా డబ్బులు ఇస్తే బైక్ కొం టానని కొంతకాలంగా నానమ్మను వేధిస్తున్నాడు. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి.
రెండు రోజుల కిందట పెండ్లి అయిన ఇద్దరు మనవరాళ్లు కూడా వచ్చారు. వారి సమక్షంలో శుక్రవారం ఉదయం మరోసారి డబ్బుల కోసం గొడవ జరిగింది. వారుకూడా .. మద్యానికి బానిసై ఇష్టానుసారంగా డబ్బు లు ఖర్చు చేస్తే నానమ్మ ఎలా డబ్బులు ఇస్తుందని ప్రశాంత్‌ను మందలించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రశాంత్.. సాయంత్రం బయటికి వెళ్లి, మద్యం తాగి ఇంటికి వచ్చాడు.
మళ్లీ డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ నానమ్మ తలను గోడకేసి బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.