సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఒకవైపు ట్రాఫిక్ జాం..వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు మధ్య సమన్వయం లోపమే కారణమని తెలుస్తుంది. ఎంఈటీ బృందాలు హైడ్రాకు చెందిన ఖాకీల డైరెక్షన్లో పనిచేస్తుండగా.. ఫీల్డ్‌లో నలుగురితో ఉన్న ఎంఈటీ బృందాలు జీహెచ్ఎంసీ ఇంజినీర్ల ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు.
వాస్తవంగా ఇంజినీర్ల పర్యవేక్షణలో ఎంఈటీ బృందాలు పనిచేస్తే సహాయక చర్యలు వేగిరం అవుతూ సమస్యకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఎంఈటీ, ఇంజినీర్ల మధ్య లోపించిన కో ఆర్డినేషన్‌తో వరద కష్టాలు అధికమవుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలో హైడ్రా ప్రత్యేక బాధ్యత తీసుకుంటుందని ప్రకటించిన కమిషనర్ రంగనాథ్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయడం లేదన్నది పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ ఇంజినీర్ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తుందని, చెబుతున్నారు.
హైడ్రాకు సహకరిస్తున్నప్పటికీ స్పందన కరువు..
గతంలో ఎన్నడూ లేని విధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను ఈ సారి జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు ప్రభుత్వం బదలాయించింది. గత నెల 9వ తేదీన జారీ అయిన మెమో ప్రకారం ఏ ఏ పనులు చేయాలో పేర్కొంటూ హైడ్రాకు సూచించారు. క్యాచ్పిట్ల మూతలపై పేరుకుపోయిన చెత్తాచెదారాలు తొలగించడం, అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు చేపట్టాలి. నాలా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. వర్షాలు వెలిశాక నాలాల్లో పూడిక తీత పనులు చేయాలి. రోడ్లపై ఉండే పూడిక తొలగించాలి. వరద నీరు నాలాల్లోకి సాఫీగా వెళ్లేందుకు ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగించడం, రోడ్లపై పడే విద్యుత్ స్తంభాలు, చెట్ల కొమ్మలు తొలగించాలి.
కానీ ఈ పనులను హైడ్రా ఎంఈటీ బృందాలు ఆయా శాఖలు జలమండలి, విద్యుత్, జీహెచ్ఎంసీల ఇంజినీర్లతో కలిసి పనిచేయాలి. కానీ అలా జరగడం లేదు. తమ వైపు నుంచి చేయాల్సిన పనులు చేస్తున్నామని ఇంజినీర్లు చెబుతున్నారు. తాము హైడ్రాకు సహకరిస్తున్నప్పటికీ వారి నుంచి ఉండాల్సిన స్పందన ఉండడం లేదని ఆరోపిస్తున్నారు. హైడ్రా అధికారులకు నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో, అక్కడి నుంచి వాన నీరు ఏ నాలాలోకి వెళ్తుందో వారికి ఎన్నో పర్యాయాలు తెలియజేశామన్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 141 వాటర్ లాగింగ్ ప్రాంతాల వివరాలు తెలిపామని చెప్పారు.
వరద నీరు నిలిచే ప్రాంతాలు..
వరద నీరు నిలిచే ప్రాంతాలైన ఈసీఐఎల్, ఉప్పల్ స్టేడియం, చిలుకానగర్ టీ జంక్షన్ ఉప్పల్, నల్లచెరువు ఆదిత్య హాస్పిటల్, నాగోల్ ఆదర్శ్‌నగర్ కాలనీ రోడ్ నం1, సితార హోటల ఎల్బీనగర్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ రెయిన్బో హాస్పిటల్, సాగర్ రింగు రోడ్డు, చింతలకుంట కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, చంపాపేట, సరూర్‌నగర్ పీ అండ్ టీ కాలనీ, మలక్‌పేట ఆర్యుబీ, చంచల్‌గూడ వై జంక్షన్, డబీర్‌పుర దర్వాజ, ఛత్రినాక పోలీస్‌స్టేషన్ ఎదురుగా, సిటీ కాలేజ్ వద్దర, పురాణపూల్ గ్రేవీ యార్డు, బహదూర్‌పుర ఫిజా హోటల్, ఉద్మాగడ్డ, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ఫిల్లర్ నం 192, 264, లంగర్‌హౌజ్ నేతాజీనగర్, రంగమహల్ వై జంక్షన్, బషీర్‌బాగ్ టూ కోఠి, ఖైరతాబాద్ వీవీ స్టాచ్యు, మైత్రీవనం జంక్షన్, లక్డీకపూల్ ద్వారక హోటల్, టౌలీచౌకీ గెలాక్సీ థియేటర్, షేక్‌పేట నాలా హెచ్‌పీ పెట్రోల్ పంపు, గచ్చిబౌలి జయబేరి పినే వ్యాలీ, బయో డైవర్సిటీ జంక్షన్, కొండాపూర్ మజీద్‌బండ, మూసాపేట మెట్రో స్టేషన్, శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి, శిల్పారామం ఎదురుగా, ప్రశాంత్‌నగర్ బస్టాండ్, నర్సాపూర్ క్రాస్‌రోడ్, మౌలాలి , వీఎస్టీ, విద్యానగర్ పద్మా నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, నింబోలిఅడ్డాలో వరద నీటితో కష్టాలు అధికమవుతున్న చర్యలు చేపట్టడంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వం వహిస్తున్నారు.
ఒక్క కిలోమీటర్.. నలభై ఐదు నిమిషాలు
గ్రేటర్లో ఎటు చూసిన బారులు తీరిన వాహనాలే..ఏ జంక్షన్ చూసినా ట్రాఫిక్ జామే..ఒక్క కిలోమీటర్ ప్రయాణానికి ముప్పావుగంట సమయం..గ్రేటర్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక..ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనంటూ భయపడుతున్నారు. భారీ వర్షంలో ఎల్బీనగర్ నుంచి బంజారాహిల్స్‌లో ఉండే ఆఫీస్‌కు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరితే ఏడు గంటలకు చేరవలసి వచ్చిందని రాజేశ్ అనే ఉద్యోగి తెలిపారు. సాధారణంగా అరగంటలో ఆఫీస్‌కు చేరే వాడినని.. రెండున్నర గంటల పాటు బంపర్ టు బంపర్ కారు నడపడం అంటే ఓపికకు పరీక్ష పెట్టారన్నారు.
దారి పొడవునా సిగ్నల్స్ ఉన్న చోట తప్ప ఎక్కడా ట్రాఫిక్ పోలీసు గానీ, హైడ్రా సిబ్బంది కానీ కనిపించలేదని సదరు ఉద్యోగి చెప్పాడు. ఖైరతాబాద్, బేగంపేట, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్ వద్ద భారీ ట్రాఫిక్ కంట్రోలింగ్‌లో బాధ్యత తీసుకుంటామని హైడ్రా చెప్పింది. జూన్‌లో వచ్చిన ఆర్డర్ ప్రకారం ట్రాఫిక్ క్లియరెన్స్‌లో హైడ్రా కూడా చొరవ చూపించాలి. హైడ్రా లేనప్పుడు ట్రాఫిక్ నియంత్రించిన పోలీసులు ఇప్పుడు ఇరు శాఖల సమన్వయ లోపంతో నామమాత్రంగా పనిచేస్తున్నారు.
చెరువుల వద్ద పొంచిఉన్న ముప్పు..
అసలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు…చెరువుల సమీపంలో ప్రాంతాల వద్ద ఆప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మేనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఎఫ్టీఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) కంటే తక్కువ నీటి నిల్వ ఉండేలా చూసుకోవాలి. కుండపోత వర్షాలు కురిసిన చెరువు అలుగులు మత్తడి పోయకుండా చర్యలు చేపట్టాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ చెరువుల్లోని నీటి మట్టాలను కనీసం తనిఖీలు చేయడం లేదు. చాలా వరకు చెరువులు నిండుకుండలా మారాయి.
ముఖ్యంగా సరూర్‌నగర్ పెద్ద చెరువు, కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు, లింగంపల్లిలోని గోపి చెరువు, ఫాక్స్ సాగర్, నల్లగండ్ల ఇతరత్రా చెరువుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే చెరువులు పొంగిపొర్లి పక్కనున్న కాలనీలు, బస్తీలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చెరువుల్లో నీటి మట్టం తనిఖీ చేస్తూ తూములు, అలుగుల ద్వారా నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం…మరో వైపు లేక్ విభాగంలో గడిచిన పది నెలలుగా ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉండడం చెరువుల పరిరక్షణ, వరద నీటి నివారణపై అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతున్నది.
హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తాం – ఆర్ వి కర్ణన్
మాన్సూన్ ఎమర్జెన్సీ విపత్తుల సమయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేస్తామని, సాంకేతికంగా, లాజిస్టిక్, రిసోర్స్ పరంగా హైడ్రాకు వార్డు, సర్కిల్, జోన్ల వారీగా పూర్తి సహకారం అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. వర్షాకాల సీజన్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు హైడ్రాకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం సంపూర్ణంగా సహకారం ఉంటుందన్నారు. ఓపెన్ నాలా, పూడికతీత నిర్వహణ, కొత్తగా నిర్మించిన సంపుల నిర్వహణ జీహెచ్ఎంసీ చూసుకుంటుందని, లేక్‌లలో నీటి నిల్వ స్థాయి సమాచారాన్ని హైడ్రాతో పంచుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని కమిషనర్ తెలిపారు.
సిల్ట్ తరలించేందుకు సహకరించండి- రంగనాథ్
గ్రేటర్లో 11 అండర్‌పాస్‌ల నిర్వహణ బాధ్యత హైడ్రా తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఫ్లై ఓవర్లపై వర్షపు నీరు నిలువకుండా చూసేందుకు వర్షపు నీరు వెళ్లే మార్గాలను క్లీనింగ్ బాధ్యత తాము చేస్తామని తెలిపారు. క్యాచ్పిట్లలో డీ సిల్టింగ్ బాధ్యతలను, నాలా సేఫ్టీ ఆడిట్ బాధ్యతలు తాము చూస్తామని పేర్కొన్నారు. క్యాచ్పిట్లతో డీ సిల్టింగ్ చేయగా వచ్చే మట్టిని తరలించేందుకు వీలుగా వార్డుల వారీగా పాయింట్లను ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సహకరించాలని రంగనాథ్ సూచించారు.
డీజీపీ ఆఫీస్‌కు మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ అటాచ్
సిటీబ్యూరో, జులై 24 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అలసత్వం, పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందుకు గల కారణాలను ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనకపోవడం గమనార్హం.
జోన్ నీళ్లు నిలిచే ప్రాంతాల సంఖ్య : 141
ఎల్బీనగర్ : 14
చార్మినార్ : 18
ఖైరతాబాద్ : 35
శేరిలింగంపల్లి : 32
కూకట్పల్లి : 24
సికింద్రాబాద్ : 18