సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక బస్తీలు మునిగిపోవడానికి కృత్రిమ వరదలే కారణమా.? జలమండలి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారమే జంట జలాశయాల్లో నీటిని పరిమితికి మించి నిల్వ చేసి బస్తీల మీదకు వదిలారా.? మూసీ పరీవాహక ప్రాంతాల బస్తీలు, కాలనీలను వరద పేరిట నీట ముంచితే ఖాళీ చేయించడం సులభం అవుతుందని భావించారా.? మూసీ ప్రాంత ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తే స్వతహాగానే ఖాళీ చేస్తారని అనుకున్నారా..? జలమండలి అధికారుల తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నీ నిజమని స్పష్టమవుతున్నది.
పక్కా ప్లాన్ ప్రకారమే జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌ను పూర్తిస్థాయిలో నింపి ఒక్కసారిగా బస్తీల మీదకు వదిలినట్లు తేటతెల్లమవుతున్నది. దీనంతటికీ జంట జలాశయాల ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసిన సెప్టెంబర్ 26, 27న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోలు, అక్టోబర్ 4, 5న చూపిన ఇన్‌ఫ్లో అవుట్ ఫ్లోలకు ఉన్న భారీ వ్యత్యాసాలే నిదర్శనంగా నిలుస్తున్నది. అదేవిధంగా మూసీకి వరదలు వచ్చినప్పుడు భారీ వరద వచ్చినా అటువైపు కన్నెత్తి చూడని జలమండలి అధికారులు, ఎండీ.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద ఉధృతి, నీటి విడుదలను స్వయంగా పర్యటించారు. ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే కృత్రిమ వరద సృష్టించి బస్తీల మీదకు వదిలినట్లు స్పష్టమవుతుందని నిపులు అభిప్రాయపడుతున్నారు.
కుట్రలో భాగంగానే..?
జంట జలాశయాలకు సెప్టెంబర్ 26, 27న భారీగా వరద వచ్చి చేరింది. అప్పుడు ఎక్కడా జలమండలి ఉన్నతాధికారులు ఎక్కడా కనిపించలేదు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తం చేసిన దాఖలాలు లేవు. నీటి నిల్వల సమాచారంతమకు నచ్చిప్పుడే బయటపెట్టినట్లు తెలుస్తున్నది. రెవెన్యూ, పోలీసు అధికారులు వరద ముప్పు ఉన్న బస్తీలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. కనీసం పునరావాస కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. నీట మునిగిన బస్తీవాసులకు ఆహారం, తాగునీరు కూడా అందించలేదు.
వరదలు సంభవించి వారం దాటుతున్నా.. ఒక్క ప్రభుత్వ అధికారీ అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ రెండు రోజులుగా ఇప్పుడు అంత మొత్తంలో వరద లేకున్నా నిరంతరం పర్యవేస్తున్నారు. ఏకంగా జలమండలి ఎండీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదంతా చేయాల్సింది భారీ వరదలు వచ్చినప్పుడు కదా..? ఇప్పుడెందుకు హడావుడి చేస్తున్నారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడేమీ వరదలు వచ్చి బస్తీలు మునిగేందుకే జలమండలి కావాలనే వరదను నిల్వ చేసి వదిలారు. అదంతా బయటపడేసరికి ఇప్పుడిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రజలను బస్తీల నుంచి వెళ్లగొట్టేందుకు పన్నిన కుట్రలో భాగమేనని తెలుస్తున్నది.
ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోలో భారీగా తేడాలు
జంట జలాశయాల ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో రెండు వేల నుంచి ఐదు వేల క్యూసెక్కులు ఉన్న సెప్టెంబర్ 26న రోజంతా ఔట్ ఫ్లోను రెండు వేల క్యూసెక్కులు దాటనివ్వకుండా రెండు రిజర్వాయర్లలో భారీ ఎత్తున నిల్వ ఉంచారు. ఇన్‌ఫ్లో ఆరు వేల క్యూసెక్కులు దాటేదాకా గేట్లను కూడా పదికి మించకుండా ఎత్తి తక్కువ మోతాదులో నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాతి రోజైన సెప్టెంబర్ 27న ఒకేసారి ఉస్మాన్‌సాగర్ 15 గేట్లను 9 అడుగులు, హిమాయత్ సాగర్ 11 గేట్లను 8 అడుగుల మేర ఎత్తారు. రెండు జలాశయాలు కలిపి ఒకేసారి ఏకంగా 34 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు.
అంటే 3 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వదలడంతో పరీవాహక బస్తీలతో పాటు, ఎంజీబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో నీట మునిగాయి. ప్లాన్‌లో భాగంగానే వరదల్లో మునిగిన బస్తీలకు ప్రభుత్వ అధికారులు కన్నెత్తి చూడలేదు. అక్టోబర్ 4, 5 తేదీల్లో అప్పటిలాగే వరద తీవ్రత 5 వందల క్యూసెక్కులు కూడా ఉండకున్నా 25 వందల క్యూసెక్కుల నీటిని దశల వారీగా వదులుతున్నారు. వరద తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగానే వేలాది క్యూసెక్కుల నీటిని దశల వారీగా దిగువకు వదులుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లో భారీగా పెరిగినా మూసీ పరీవాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరే పరిస్థితి రాదు. ఇదేవిధానాన్ని అప్పుడు కూడా పాటిస్తే మూసీకి వరద ఉధృతి పెరిగేది కాదు.