ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. వాటిలో ఒకటి గృహజ్యోతి పథకం. ఆది నుంచీ పలు నిబంధనలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటికీ సరిగా అమలు చేయడం లేదు. తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో అర్హులైన ప్రజలు ప్రజాపాలనలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.
కానీ, తెల్ల రేషన్‌కార్డు నిబంధనతో కొంతమంది పథకానికి దూరమవ్వగా, ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లతో మరికొందరికీ ఈ పథకం అందడం లేదు. అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి ఆయా కార్యాలయాలకు వెళ్తే.. వెబ్సైట్ సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారందరికీ ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని మరిచి కేవలం తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో అర్హత ఉన్నప్పటికీ చాలా మంది ఈ పథకానికి దూరమయ్యారు. అదే సమయంలో అద్దె ఇళ్లలో ఉండే వారికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లతో కొందరు ఈ పథకానికి నోచుకోవడం లేదు. తెల్ల రేషన్‌కార్డు నిబంధనతో లక్షలాది మంది అర్హత కోల్పోగా, మరికొందరు ఇతర కారణాలతో లబ్ధి పొందలేకపోతున్నారు. తెల్ల రేషన్‌కార్డు కలిగి అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రజా పాలన దరఖాస్తు సమయంలో మీటర్ నంబర్ రాయకపోవడం వల్ల ఇప్పుడేమీ చేయలేమని చెప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ప్రజాపాలన పోర్టల్ సరిగా ఓపెన్ అవడం లేదని అర్హులు వాపోతున్నారు.
గ్రేటర్ పరిధిలో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాల్సింది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్). అయితే గ్రేటర్ పరిధిలో నివాసం ఉంటే జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో, నగర శివారు ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే మండల ప్రజా పరిషత్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులను ఇవ్వాల్సి ఉంది.
తెల్ల రేషన్‌కార్డు ఉండి అర్హులైన వారు ఆయా కార్యాలయాలకు వెళ్లినా అక్కడ ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ (https://prajapalana.telangana.gov.in) సరిగా పనిచేడం చేయలేదని వాపోతున్నారు. నగర శివారు మున్సిపల్ కార్పొరేషన్ అయిన బండ్లగూడ జాగీర్‌లో కార్యాలయానికి స్వయంగా వెళ్లినా, ఒక్క రోజులో పని పూర్తి కావడం లేదని, పలుమార్లు కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని అర్హులు వాపోతున్నారు. ఇలా ఒక్క చోటే కాదు గ్రేటర్ చుట్టు పక్కల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్ కార్యాలయాల్లోనూ గృహజ్యోతి అర్హులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహజ్యోతి పథకాన్ని ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నా, ఇప్పటికీ అర్హులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజాపాలనకు సంబంధించిన వెబ్సైట్ సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దాలని గృహజ్యోతి అర్హులు కోరుతున్నారు.