మేడ్చల్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): భూ క్రమబద్ధీకరణ ముందుకు సాగడం లేదు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)దరఖాస్తుల పరిశీలనపై అధికారులు అంతగా దృష్టి సారించడం లేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ప్రారంభమై నెలలు గడుస్తున్నా దరఖాస్తుల పరిశీలన పూర్తికావడం లేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా భూక్రబద్ధీకరణ కోసం 1,60,338 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 55,942 దరఖాస్తులను మాత్రమే పరిశీలించారంటే అధికారులు చిత్తశుద్థికి ఇదే నిదర్శనమంటూ దరఖాస్తుదారుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో ఆశగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుదారులు వేచి చూస్తున్న అధికారులు నామ మాత్రంగానే దరఖాస్తుల పరిశీలనను కొనసాగిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని దరఖాస్తుదారులంటున్నారు. అనుమతి లేకుండా అక్రమ వెంచర్లలో విక్రయించిన ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్‌శాఖల అధికారులు సంయుక్తంగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
ఆమోదించినవి 5,820 మాత్రమే..
జిల్లాలో 1, 60, 338 దరఖాస్తులు ఉంటే ఇప్పటి వరకు 55,942 దరఖాస్తులు పరిశీలించి 5,820 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. దరఖాస్తులను పరిశీలించిన వాటిలో 1492 తిరస్కరించగా, 17,812 దరఖాస్తుల్లో సరైన ధ్రువపత్రాలు లేవని నిర్ధారించారు. మరో 26,798 దరఖాస్తులు ప్రొహిబిటేడ్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే మరో 1,06,336 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. వీటి పరిశీలనకు ఇంకా ఎంత కాలం పడుతుందోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
కావాలనే తిరస్కరిస్తున్నారా..?
క్రమబద్ధీకరణలో కావాలనే అత్యధికంగా దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు సూచించిన అన్ని ధ్రువపత్రాలను పొందుపరిచినా..తిరస్కరణకు గురికావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో ఆమోదించిన 5,820 దరఖాస్తులకు ఇప్పటి వరకు 2,165 మంది మాత్రమే ఫీజులు చెల్లించగా, 3,655 మంది ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ త్వరగా చేపేట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అయితే దరఖాస్తుదారులు కావాల్సిన పత్రాలను జత పరచకపోవడం వల్లే దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు హెల్ప్‌డెస్క్‌లను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ హెల్ప్ డెస్క్‌లలో తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.