మేడ్చల్, జూలై17(నమస్తే తెలంగాణ): సకాలంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి అందని నేపథ్యంలో విదేశాలకు వెళ్లి చదివే ఎస్సీ విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. రుణాలు తీసుకుని చదివే స్థోమత లేని ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదివే అవకాశాన్ని కోల్పోతున్నారు.
అంబేద్కర్ విదేశీ విద్యా నిధి కింద ఉన్నత చదువుల కోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి గతంలో ప్రతి ఏటా 90 మందికి పైగా విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఈ విద్యాసంవత్సరానికి విదేశాలకు వెళ్లేందుకు 32 మంది ఎస్సీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచే అత్యధిక సంఖ్యలో వెళ్లేవారు. దీంతో అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకంలో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలిచేది. గత సంవత్సరం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల ఖాతాలలో ఇప్పటి వరకు విద్యానిధి నగదు జమ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. దీంతో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా సకాలంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి అందకపోవడంతో విదేశాల్లో చదవాలనే ఆశలను వదిలేసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరంలో 32 మంది ఎస్సీ విద్యార్థులు మాత్రమే
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యా సంవత్సరంలో 32 మంది ఎస్సీ విద్యార్థులు మాత్రమే విదేశాలలో చదివేందుకు అసక్తి చూపుతున్నారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం సకాలంలో అందని నేపథ్యంలో విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడేకన్న విదేశాలకు వెళ్ల కుంటేనే మంచిందన్న అభిప్రాయాలను ఎస్సీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లేందుకు అన్ని అర్హతలు సాధించిన 32 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తుల పరిశీలన పూర్తయినా ఇప్పటి వరకు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని వర్తింపజేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఎస్సీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విదేశాలలో ప్రతి విద్యాసంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభం అవుతుందని ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఇంకా కమిటీ వేయలేదని, ఈ కమిటీ మాత్రమే విదేశాలకు వెళ్లే విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎంపికైనా విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని వర్తింప జేస్తుంది. అయితే ఇప్పటి వరకు కమిటీ నిర్ణయం తీసుకోకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణమాల క్రమంలో అప్పులు తీసుకుని విదేశాలలో చదివే స్థోమత లేని విద్యార్థులు మాత్రం విదేశాలకు వెళ్లి చదివే అవకాశాన్ని కోల్పోతున్నారు.