Ration Cards | సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీపై దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హులను పక్కనపెట్టి అర్హత ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు, వారి బంధువులకే ముందుగా మంజూరు చేస్తున్నారని మండిపడుతున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వకుండా తమ కంటే మూడు, నాలుగు నెలల తర్వాత ఐప్లె చేసిన వారి పేర్లను ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందరి కంటే ముందుగా ప్రజాపాలన, మీ-సేవల్లో దరఖాస్తు చేసుకుని, అన్ని అర్హతలున్నా నేటికీ తమ ఇండ్లకు విచారణ అధికారులు రాలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. అసలు రేషన్ కార్డులు ఏ ప్రాతిపదికన మంజూరు చేస్తున్నారో కూడా అర్థం కాని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అన్ని అర్హతలున్నా తమకు ఎందుకు రేషన్ కార్డు మంజూరు కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తులో ఏమైనా తప్పులున్నయేమోననే కంగారుతో మీ-సేవలు, పౌర సరఫరాల కార్యాలయాలకు పదుల సార్లు వెళ్లి వాకబు చేస్తున్నారు. మీ-సేవ నిర్వాహకులు దరఖాస్తులో ఎలాంటి తప్పిదాలు లేవని చెబుతున్నారని అంటున్నారు. పౌర సరఫరాల అధికారులేమో అందరికీ వస్తాయని చెబుతున్నారు కానీ.. ఇప్పటిదాకా స్టేటస్‌లో పెండింగ్ అని చూపుతున్నట్లు దరఖాస్తు దారులు వాపోతున్నారు.
మొత్తం 2.2 లక్షల దరఖాస్తులు..
రెండు రోజులుగా హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టారు. నగర ప్రజల నుంచి మొత్తం 2.2 లక్షల దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు అందాయి. అందులో ఇప్పటిదాకా 50 వేల మందికి మాత్రమే మంజూరు చేశామని మంత్రి చెబుతున్నారు. ఏడాది నుంచి ఎదురు చూస్తున్న అర్హులకు చివరకు ఎదురు చూపులే మిగిలాయి.
అయితే మంజూరు చేసిన 50 వేలలో 90 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు, వారి బంధువులు, వారి అనుకూల వ్యక్తుల పేర్లు మాత్రమే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్హత, ముందుగా అందిన దరఖాస్తులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే మంజూరు చేస్తున్నారని మండిపడుతున్నారు.
దీనిపై గ్రేటర్ కార్పొరేటర్లు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్నవారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అర్హత కలిగిన వారికి వెంటనే రేషన్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో రేషన్ సరకుల పంపిణీ సమయానికి కార్డులు అందజేయాలని కోరుతున్నారు.
90 శాతం కాంగ్రెస్ పార్టీ వాళ్లకే..
ఖైరతాబాద్ సర్కిల్ నుంచి 22,399 మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 1959 మందికి మాత్రమే కొత్త కార్డులు మంజూరు చేశారు. ఈ సర్కిల్లోని సోమాజిగూడ డివిజన్‌కు 700 నుంచి 800 కార్డులు మంజూరైనట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. మంజూరైన మొత్తం కార్డుల్లో 90 శాతానికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, వారి బంధువులు, అనుకూల వ్యక్తులే ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఉన్నట్లు వారు మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకే రేషన్ కార్డులు ఉంటాయని చెబుతున్నారు. అధికారులు సైతం ఏకపక్షంగా వ్యవహరించకుండా అర్హులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
పోలీసుల తీరుకు..విలేకరుల నిరసన
గోల్నాక, ఆగస్టు 2: అంబర్‌పేట మహారాణా ప్రతాప్ హాల్లో అధికారికంగా నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను దర్జాగా పంపుతూ.. పలువురు లబ్ధిదారులతో పాటు పలు ప్రముఖ పత్రికలకు చెందిన విలేకరుల వాహనాలను లోనికి వెళ్లకుండా గేటు వెలుపలే ఆపేశారు.
ఇక హాల్ ఆవరణ వద్దకు ఊరు పేరు లేని కొందరు విలేకరులను కూడా అనుమతించిన పోలీసులు.. కవరేజీ కోసం వచ్చిన పలు ప్రముఖ పేపర్ల రిపోర్టర్లను అడ్డుకొని అవమానించారు. వారి అక్రిడేషన్ కార్డులు తనిఖీ చేసి చివరకు అసహనంతో లోపలికి అనుమతించడంతో పోలీసుల తీరుపై పలువురు సీనియర్ జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేశారు.