సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఒక కంపెనీలో తయారైన ఔషధాలను మరో కంపెనీ పేరు పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఓ ఫార్మా కంపెనీ గుట్టును డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రట్టు చేశారు. సదరు కంపెనీపై దాడులు జరిపి రూ.1.33 కోట్ల విలువజేసే నాలుగు రకాల యాంటీబయోటిక్ మందులను సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం… సిద్ధిపేట్ జిల్లా, కరకపట్లలోని ‘జొడాస్ ఎక్స్పోయిమ్ ప్రై.లి’కి విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసే లైసెన్స్ ఉంది. దీంతో సదరు కంపెనీ వివిధ రకాల ఔషధాలను రష్యాకు ఎగుమతి చేస్తున్నది. అయితే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940 ప్రకారం ఔషధాలు తయారు చేసే కంపెనీ మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయాలి.
అంటే ఔషధాలను ఎగుమతి చేసే అనుమతి ఉన్న కంపెనీలు ఎగుమతి చేయబోయే ఔషధాలను ఆ కంపెనీ మాత్రమే తయారు చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా జోడాస్ ఎక్స్పోయిమ్ కంపెనీ పలు రకాల యాంటీబయోటిక్ మందులను స్వయంగా తయారు చేయకుండా నగరంలోని మేడ్చల్-మల్కాజిగిరిలో ఉన్న జీనోమిక్స్ ప్రై.లిలో తయారు చేసిన అంపిసిల్లిన్ ప్లస్ సల్బాక్టమ్ 1000ఎంజి ప్లస్ 500ఎంజి ఇంజిక్షన్లను, మహారాష్ట్రలోని జజెన్ ఫార్మ ప్రై.లిలో తయారు చేసిన అమాక్సిలిన్ 1000ఎంజి ప్లస్ క్లావులానికాసిడ్ 200ఎంజి, మెరొపెనమ్ 500ఎంజి ఇంజిక్షన్లను జోడాస్ ఎక్స్పోయిమ్ ప్రై.లి. తయారు చేసినట్లు ఔషధాలపై లేబుల్స్ అంటించి రష్యా దేశానికి ఎగుమతి చేస్తున్నారు.
సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు బుధవారం సిద్ధిపేట, కరకపట్లలోని బయోటెక్ పార్క్‌లో ఉన్న ‘జొడాస్ ఎక్స్పోయిమ్ ప్రై.లి.’ఫార్మ కంపెనీపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీల్లో తయారు చేసిన ఔషధాలను తమ కంపెనీ తయారు చేసినట్లు తప్పుడు లేబుల్స్ ముద్రించి రష్యాకు దిగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.1.333 కోట్ల విలువజేసే 38,175 వైల్స్ యాంటీబయోటిక్ ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరిపిన ఈ దాడుల్లో డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్ సుష్మి, సీహెచ్.కార్తిక్ శివ చైతన్య, టి.శివతేజ, పి.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.