ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 17: డ్రగ్స్ విషయంలో తమ పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని అవి వాడకుండా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పాటైన తర్వాత మాదక ద్రవ్యాలు నగరంలోకి రాకుండా నియంత్రించగలిగామని చెప్పారు. ఈస్ట్‌జోన్ పరిధిలోని కళాశాలల్లో శనివారం ఆయన యాంటీ డ్రగ్స్ కమిటీలను ప్రారంభించారు. ఓయూలోని టాగోర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్‌దత్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో పాటు పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
140 కోట్ల మన దేశ జనాభాలో 11 కోట్ల మంది మాదక ద్రవ్యాల బారిన పడినట్లు నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. డ్రగ్స్ అలవాటైన కొత్తలో ఆనందంగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. పిల్లలు ఉదయం పూట బాగా లేటుగా లేస్తున్నా, మధ్యాహ్నం వరకు పడుకునే ఉంటున్నా వారి పట్ల శ్రద్ధ వహించండి. డ్రగ్స్‌కు అలవాటు పడి మాకు పట్టుబడిన విద్యార్థుల్లో సగం మంది అమ్మాయిలే కావడం ఆశ్చర్యంగా ఉంది. అటువంటి వారిలో కొంత మందికి డ్రగ్స్ తీసుకోకుండా కనీసం పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొన్నదంటే.. అర్థం చేసుకోండి. కానీ గత ఏడాది నుంచి పరిస్థితి మారింది. మన నార్కోటిక్ వింగ్ అద్భుతంగా పనిచేస్తున్నది. డ్రగ్స్ సరఫరా మూలాలకు అడ్డుకట్ట వేశాం. డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నాం.
– నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 17: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల ప్రాంగణాలను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ డ్రగ్స్ కమిటీ (ఏడీసీ)లను ప్రారంభించే కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ సీవీ ఆనంద్ హాజరై మాట్లాడారు. 140 కోట్ల దేశ జనాభాలో 11 కోట్ల మంది మాదక ద్రవ్యాల బారిన పడినట్లు నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. ఇది దాదాపు 8 శాతమని, కరోనా మహమ్మారి విజృంభించే కంటే ముందు ఇది తక్కువగా ఉండేదని గుర్తు చేశారు. ఆ సమయంలో గ్రామ, మండల స్థాయిలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిందని చెప్పారు. మన రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
డ్రగ్స్ కట్టడికి ఐదంచెలు..
ప్రస్తుతం గోవా డ్రగ్స్‌కు హబ్‌గా మారిందని సీపీ సీవీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ వాటర్ ప్యాకెట్ కొనుక్కున్నంత సులువుగా డ్రగ్స్ కొనుగోలు చేయవచ్చని, పిల్లలను అక్కడికి వెళ్లనీయకపోవడమే ఉత్తమమని తల్లిదండ్రులకు సూచించారు. డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ను స్థాపించామని, దానికి డీసీపీ చక్రవర్తి ఇన్చార్జిగా నియమించామన్నారు. గతేడాది ఆ వింగ్ అద్భుతంగా పనిచేసిందని, ఐదంచెలుగా డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకున్నదని తెలిపారు.
గోవా గ్యాంగ్‌లను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన డీసీపీ చక్రవర్తిని అభినందించారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మన రాష్ట్రంలో డ్రగ్స్‌పై నిఘా చాలా ఎక్కువగా ఉందని సీపీ చెప్పారు. ర్యాగింగ్, విద్యార్థినులపై వేధింపులు, మాదక ద్రవ్యాల కట్టడిపై త్వరలోనే ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుందని తెలిపారు.
ఠాగూర్ ఆడిటోరియం గురించి ప్రస్తావిస్తూ ఇదే వేదికగా 31 ఏండ్ల క్రితం తాను ఎంఏ ఎకానమిక్స్‌లో బంగారు పతకాన్ని అప్పటి గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించానని సీపీ సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకే సివిల్స్ ఫలితాలు వెలువడ్డాయని, 77వ ర్యాంకు సాధించి ఐపీఎస్కి ఎంపికయ్యానని సీపీ చెప్పారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ సందీప్, అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్‌దత్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ సీఐ రమేశ్‌నాయక్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.
246 కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు…
ఇప్పటి వరకు ఈస్ట్ జోన్ పరిధిలో 38 డిగ్రీ కళాశాలలు, 17 ఇతర కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశామని సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే 246 కళాశాలల్లో ఏడీసీ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో పాఠశాలల స్థాయిలో కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలో కనీసం ఐదుగురు సభ్యులు ఉంటారని, అందులో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం కూడా ఉంటారని పేర్కొన్నారు.
కళాశాలల్లో డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోస్టర్లు ఉంచడంతో పాటు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయడంతో ర్యాగింగ్ కొంతవరకు తగ్గిందని వివరించారు. ఎవరైనా విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగించినట్లు అనుమానిస్తే వారి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.