హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించేలా దీవించాలని పరమశివునిడిని ప్రార్థించారు.
సహనానికి, త్యాగానికి ప్రతీకగా సృష్టి లయకారుడైన ఉమామహేశ్వరుడు భక్తులతో నిత్య పూజలందుకుంటారని తెలిపారు. భక్తిశ్రద్ధలతో కొలిస్తే సామాన్యుల కోరికలూ తీర్చే భోళా శంకరుడని, భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక జీవనంలో పరమశివునిది ప్రత్యేక స్థానమని శ్లాఘించారు.
ప్రాణికోటిని రక్షిస్తూ, సృష్టి మనుగడ కోసం గరళాన్ని మింగిన మహాత్యాగి, ఆదియోగి, గరళకంఠుడు ఆ పరమేశ్వరుడు అని స్తుతించారు. మహాశివరాత్రి సందర్భంగా దృఢచిత్తంతో జాగరణ చేస్తూ, ఉపవాస దీక్షలతో భక్తులు శివుడిపైఉన్న భక్తిని చాటుకుంటారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా దీవెనలు అందించాలని, దేవదేవుడైన ఆ పరమశివుడిని కేసీఆర్ ప్రార్థించారు.