లేక్ సిటీగా పేరొందిన మహానగరంలో చెరువులకు పూర్వవైభవం సంతరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కబ్జాలతో కాలగర్భంలో కలిసిపోతున్న నీటి వనరులకు సర్కారు చర్యలు పునర్జీవం కల్పించాయి. కాకతీయుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం చెరువులను సుందరీకరించి పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దింది. దాదాపు 510.5కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులను అభివృద్ధి చేస్తున్నది. చెరువు స్థలాలు కబ్జాలు కాకుండా 1170 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. మొదటి దశలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో హెచ్ఎండీఏ 20 చెరువులను అభివృద్ధి చేసింది. సర్కారు స్ఫూర్తిని అందుకున్న కార్పొరేట్, నిర్మాణ రంగ సంస్థలు సామాజిక బాధ్యతగా 50 చెరువులను దత్తత తీసుకున్నాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒకే రోజు ఒప్పందం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే మండుటెండల్లో మత్తడి దుంకుతున్న చెరువుల వద్ద దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చెరువుల పండుగ నిర్వహిస్తున్నారు. వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. చెరువు నిండుగా ఉండడంతో ఊరంతా పండుగలా మారింది.
సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు అభివృద్ధి పేరిట కబ్జా కోరల్లో నలిగిపోయాయి. చెరువులు సైతం కాంక్రీట్ జంగిల్లా మారుతున్నా.. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలకు ఊతమిచ్చినట్లయింది. కొన్ని చెరువులు కాలగర్భంలోనూ కలిసిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వనరులు పునర్జీవనాన్ని పొందుతున్నాయి. సహజసిద్ధంగా నీటి వనరులకు కించిత్తు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి-సుందరీకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది.
ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు దాదాపు రూ.510.5కోట్లతో వివిధ పనులు చేపడుతున్నది. చెరువుల సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఎంట్రన్స్ ప్లాజా, లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులను ఆకర్షించేలా బ్యూటిఫికేషన్, పరిసర ప్రాంతాలలో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూల మొక్కలు, వాకర్స్, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర బ్యూటిఫికేషన్ పనులు చేపట్టి పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. కాగా సీఎస్ఆర్ కింద 50 చెరువులను పలు కంపెనీలు దత్తత తీసుకున్నాయి. ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పరిధిలో 20 చెరువులు, హెచ్ఎండీఏ పరిధిలో 20 చెరువులను వందల కోట్లు ఖర్చు చేసి మినీ ట్యాంక్‌బండ్ కేంద్రాలుగా మార్చారు.
పునరుద్ధరణ విశేషాలు
2014-15 నుంచి 2023-24 సంవత్సరం వరకు చేపట్టిన పనుల వివరాలు
మిషన్ కాకతీయ ప్రోగ్రాంలో..
చెరువు దత్తతలో నిర్మాణ రంగ సంస్థలు
గ్రేటర్ పరిధిలో ఒకవైపు ప్రభుత్వపరంగా జరుగుతున్న చెరువుల అభివృద్ధితో స్ఫూర్తి పొందిన పలు కార్పొరేట్ సంస్థలు, నిర్మాణ రంగ సంస్థలు తమ సొంత నిధులతో పలు చెరువులను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద 50 చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా వాకింగ్ ట్రాక్, బెంచీలు, ఓపెన్ జిమ్స్, టాయిలెట్లు, లైటింగ్ సదుపాయం, పిల్లల గేమింగ్ జోన్, కాన్సెప్ట్ థీమ్ పార్కు, గెజిబోలు, సెక్యూరిటీ రూం, అంపిథియేటర్ తదితర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ఇందుకోసం ఒక్కో నిర్మాణ సంస్థ కోటి నుంచి రూ.15కోట్లు వరకు సంబంధిత నిర్మాణ సంస్థ ఖర్చు చేయనున్నది. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చాయి. ఒకే రోజు 50 చెరువుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులకు ఒప్పంద పత్రాలను అందజేశారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 20 చెరువులకు నయా అందాలు
చెరువుల పరిరక్షణ, సుందరీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందుకోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ప్రత్యేకంగా పనిచేస్తున్నది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిజాం నవాబులు పాలించిన సమయంలో నగరాన్ని ముత్యాల నగరంగా, లేక్ సిటీగా పిలిచే వారు. అలాంటి నగరంలో ఇప్పటికీ ముత్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నా, చెరువులు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలకు గురై కనుమరుగైపోయిన పరిస్థితి. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం గ్రేటర్ చుట్టూ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులకు పూర్వ వైభవాన్నే కాదు… వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నది. మొదటి దశలో భాగంగా గత ఏడాది 20 చెరువులను అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.100 కోట్లను హెచ్ఎండీఏ ఖర్చు చేసింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మరిన్ని చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై ప్రత్యేక ప్రణాళికను హెచ్ఎండీఏ అధికారులు రూపొందించారు. అదేవిధంగా సుందరీకరణకు నిధుల కొరత సమస్య లేకుండా చేయడంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్( సీఎస్ఆర్) నిధులతో చెరువుల సుందరీకరణలో పాలు పంచుకునేలా చేయనున్నారు.
నిఘా నీడలో చెరువులు
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. గజం స్థలం కూడా కబ్జాకు గురికాకుండా ఉండేందుకుగాను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 4జీ/5జీ సిమ్ బెస్డ్తో 1170 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సంబంధిత చెరువుల్లో ఎలాంటి డంపింగ్ యార్డు వేయకుండా, వేసిన వారిని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం, కబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఈ విధానం సులువుగా ఉంటుందని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
P