సిటీ బ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడిగా కాలుష్య కోరల్లో మగ్గుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెం ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. కాలుష్యాలను వెదజల్లే రసాయన పరిశ్రమలను తమ గ్రామం చుట్టూ ఏర్పాటు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.
తమ బిడ్డలు రోగాల బారిన పడి ప్రాణాలు విడుస్తుంటే దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ.. కాలం వెల్లదీస్తున్నామని రోదిస్తున్నారు. తమ రోదనలు, బాధలు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పట్టట్లేదని వాపోతున్నారు. సనత్‌నగర్‌లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయానికి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి.. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రసాయన పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై తమ జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పీసీబీ అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్లే వ్యవహరిస్తున్నారని.. దున్నపోతు ఫొటోను ప్రదర్శిస్తూ..శుక్రవారం ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మంత్రిని కలిసి తమ బాధలు చెప్పుకొందామంటే అనుమతివ్వక పోవడంతో గేటు ముందు బైఠాయించారు. పర్యావరణ మంత్రి కొండా సురేఖ కార్యాలయం లోపలే ఉన్నా.. కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా అధికారులు, పోలీసులు అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణ దినోత్సవం రోజున సంబంధిత మంత్రిని కలిసి బాధితులు వినతి పత్రం ఇస్తే.. పరిశీలిస్తాం.. అధికారులకు చెప్తాం.. అంటూ వెళ్లిపోయారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వారి గోడు చెప్పుకోనియకుండా దీనిపైన ప్రత్యేక సమావేశం పెడదామని మంత్రిని మభ్యపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం మంత్రి తమతో కొంత సమయం మాట్లాడనీయకుండా అధికారులు అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడం గ్రామ పరిసరాల్లో హజలో లాబొరేటరీ, శ్రీజయ, వినీత్, బృందావన్, కెమిక్ లైఫ్ సైన్స్, ఆప్టిమస్ డ్రగ్స్, విజెసాయి, ఎస్వీఆర్, ఆర్కిమెడిస్, రావూస్, సెన్సేషనల్, ఎస్వీఆర్ ట్రేడర్స్ రసాయన పరిశ్రమల నుంచి విష వాయువులు వెలువడుతూ వాయు, జల కాలుష్యం వెదజల్లుతున్నది.
ఈ పరిశ్రమలు వదిలే కాలుష్య కారకాలతో అక్కడి ప్రజలు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు జన్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం వారి గోడు పట్టించుకోకుండా పరిశ్రమల యజమానులకు కొమ్ముకాస్తున్నారు. కనీసం పర్యావరణ మంత్రి తమ బాధను పట్టించుకోని పరిశ్రమలను మూసేయాలని వేడుకుంటున్నారు.