మేడిపల్లి, ఏప్రిల్ 13 : చర్లపల్లిలో మూడు నెలల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, అమె పిల్లల కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్యా పిల్లల ఆత్మహత్యకు తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి, అతని భార్య లక్ష్మి కారణమంటూ వీరిని గట్టిగా విచారిస్తే నిజాలు బయటకొస్తాయని విజయారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి సోమవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వారితో ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్తి కోసం తన కుటుంబాన్ని మోసం చేశారని తెలిపారు. భార్యా పిల్లలు ఆత్మహత్య చేసుకున్న బాధలో తాను ఉంటే తనను బెదిరించారన్నారు. తన ఆస్తులపై వారికి కన్ను పడిందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తన భార్య చనిపోయిన మూడు రోజులకే ఆస్తులన్నీ తమ బిడ్డ పేర ఉన్నాయని చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని అది అబద్ధమన్నారు. తమ డబ్బులతోనే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, రియల్ ఎస్టేట్ కోసం ఒక్కొక్కసారి డబ్బులు తీసుకున్నప్పుడు కొన్ని ఆస్తులు తన భార్యపైనే రిజిస్ట్రేషన్ చేసుకుందన్నారు.
వారిపై తన భార్యకు నమ్మకం లేదన్నారు. నా భార్య చనిపోయిన రోజు మా అత్త మూడు గంటలు ఇంట్లో ఉండి కిలోన్నర బంగారం, ఒక కోటీ 40 లక్షల నగదు, విలువైన వస్తువులు తీసుకుపోయిందన్నారు. ఆమె స్నేహితురాలు కూతురు రేఖ ద్వారా పంపించిందన్నారు. తాను రేఖకు ఫోన్ చేస్తే నిజమేనని, ఓ డబ్బా పంపించిందని, అందులో ఎంత ఉందో తనకు తెలియదని డబ్బాకు తాళం ఉందని చెప్పిందన్నారు. ఆ డబ్బా తాను తిరిగి ఆమెకు ఇచ్చానని చెప్పిందన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో నా భార్య సూసైట్ నోట్ రాసిందేమో అన్నారు. నా భార్య బెడ్రూంలో కాలిపోయిన కాగితాలు కనిపించాయని, ఆ కాగితాలు ఎవరు కాల్చారో చెప్పాలన్నారు. రెండు రోజుల్లో విచారణ జరుపుతామని, రక్షణ కల్పిస్తామని సీఐ హామీ ఇచ్చారని తెలిపారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.