సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తే అతడి మెడలో ఉన్న బంగారం గొలుసును కొట్టేశారు. వివారాల్లోకి వెళితే.. ఇటీవల సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే ఘటనకు సంబంధించిన అంశంలో ఒక ప్రైవేట్ దవాఖాన నిర్వాహకంపై బాధిత కుటుంబ సభ్యులు సరూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది.
ఈ నెల 17న అర్ధరాత్రి దాటిన తరువాత సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి చంపాపేట్ గ్రీన్ పార్కు కాలనీ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సునీల్‌కుమార్(28)ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కియా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సునీల్‌కుమార్ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు సమీపంలోని జీవన్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని మరో దవాఖానకు తీసుకెళ్లాలంటూ సూచించడంతో కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత సునీల్‌కుమార్ మృతి చెందాడు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారుకావడంతో కారు నంబర్‌ను గుర్తించి గత ఆదివారం నిందితుడు సాయి చరణ్ సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంత్యక్రియలు పూర్తయిన తరువాత సునీల్‌కుమార్ మెడలో ఉన్న 22 గ్రాముల బంగారం చైన్ ఎక్కడకిపోయిందనే కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. ప్రమాదం జరిగిన తరువాత దవాఖానలోకి తీసుకెళ్తుండగా కన్పించిందని బాధితుడిని దవాఖానకు తీసికెళ్లిన వారు చెప్పారు.
అప్పటికే దవాఖాన వద్దకు కుటుంబ సభ్యులు వెళ్లి మరో దవాఖానకు తరలించారు, ఆ సమయంలో అతడి మెడలో గొలుసు కన్పించలేదు. ఈ విషయంపై దవాఖాన సిబ్బందిని అడగగా తమకు తెలియదని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ విషయంపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు.