సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తొలిసారిగా ఓ వ్యక్తికి పేగు మార్పిడి చేశారు. 40 ఏండ్ల ఓ వ్యక్తి షార్ట్గట్ సిండ్రోమ్ అనే పేగు సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరాడు. పదే పదే సెంట్రల్లైన్ ఇన్ఫెక్షన్స్తో పాటు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం తదితర కారణాలతో రోగి చిన్న పేగులోని కొంత భాగాన్ని తొలగించారు. దీంతో చిన్నపేగు పరిమాణం 30 సెం.మీలకు కుదించుకుపోయింది. పేగు పరిమాణం తగ్గడంతో ఆక్సిజన్, ఇతర పోషకాలను తీసుకోలేక శరీరం బలహీనంగా మారి, ప్రాణపాయ స్థితికి చేరాడు.
సమస్య రోజురోజుకు తీవ్రమయ్యే అవకాశాలుండడంతో రోగికి పేగు మార్పిడి చేయాలని నిర్ణయించిన సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్.. ఈనెల 9న జీవన్మృతుడి నుంచి సేకరించిన పేగును మార్పిడి చేశారు. సర్జరీ సక్సెస్ కావడంతో రోగి క్రమంగా కోలుకుంటున్నట్లు డాక్టర్ మధుసూదన్ తెలిపారు. పేగు మార్పిడి చేయడం తెలుగు రాష్ర్టాల్లోనే ఇది తొలిసారి అని వైద్యులు తెలిపారు.