మూసాపేట, జూలై 17: కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దొండి సునీత(42) తన కుమారుడు బాల్ రెడ్డితో కలిసి కూకట్పల్లి ఇంద్రహీల్స్లో నివాసం ఉంటున్నది. ఈనెల 5న హెచ్ఎంటీ హిల్స్ లోని కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి మరుసటి రోజు ఉదయం నాగర్ కర్నూల్లోని ఇంద్రకల్ లో ఉంటున్న తన కూతురు వద్దకు వెళ్లింది.
అక్కడ సునీత అస్వస్థతకు గురికావడంతో నాగర్ కర్నూల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఈనెల 15న నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు బాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.