హైదరాబాద్: కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. శుక్రవారం సాయిచరణ్ కాలనీకి చెందిన చాకలి పెద్దగంగారం (70) చనిపోయిన విషయం తెలిసిందే. గత మంగళవారం (ఈ నెల 8న) కేపీహెచ్‌బీ కాలనీలోని కల్లు కాంపౌండ్‌లో హైదర్‌నగర్, సాయిచరణ్ కాలనీలకు చెందిన పలువురు కల్లు తాగి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 58 మంది నిమ్స్, గాంధీ దవాఖానల్లో చేరారు.
కాగా, కల్తీకల్లు కేసులో కాంగ్రెస్ నేత కూన సత్యంగౌడ్‌ను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన కుమారులు రవితేజ గౌడ్, సాయితేజ గౌడ్‌ను కూడా అరెస్టు చేశారు. వీరు హైదర్‌నగర్, ఎస్పీనగర్, ఇంగ్రానగర్లలో కల్లు దుకాణాలు నడిపిస్తున్నారు. ఈ మూడు దుకాణాల్లోని కల్లు నమూనాల్లో ఆల్ఫ్రాజోలం కలిపినట్లు తేలింది. ఇక కల్తీకల్లు దందాపై చర్యలు తీసుకోకపోవడంతో బాలానగర్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ సీఐ డీ. వేణుకుమార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్‌లు మాధవయ్య, జీవన్‌కిరణ్, ఈఎస్ ఫయాజ్ తదితరులపై విచారణకు ఆదేశించారు.
మరోవైపు మేడ్చల్ జిల్లా జీడిమెట్ల రామ్‌రెడ్డినగర్‌లో కల్తీకల్లు కలకలం సృష్టించింది. ఆదివారం జీడిమెట్లలో కల్లు తాగిన నిజామాబాద్‌కు చెందిన దంపతులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.