సిటీబ్యూరో: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రాజెక్టు కోసం ఆస్తులు సేకరించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రాజెక్టు డిజైనింగ్ ప్రకారం ఇరు వైపులా 200 ఫీట్ల వెడల్పుతో ఆస్తులను సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా భూసేకరణ కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తూ..నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 6 లేన్ల భారీ రోడ్ల కోసం ఇరువైపులా కలిపి 200 ఫీట్ల మేర వెడల్పుతో ఈ ప్రాజెక్టు కోసం భూములను సేకరించనున్నట్లు ప్రకటించింది. కానీ ఎలివేటెడ్ కారిడార్ కోసం వంద ఫీట్లకు మించి ఆస్తులను సేకరిస్తే… తమకు నిలువ నీడ ఉండదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 ఫీట్ల వెడల్పులోనే ఆస్తులను సేకరించాలని, అంతకు మించి భూసేకరణ అమలు చేయవద్దని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం 200 ఫీట్ల వెడల్పుతో ఆస్తులను సేకరించేందుకు సన్నాహాలు చేయడంతో స్థానికులు మండిపడుతున్నారు.