RRR | సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డుకి ఇరువైపులా ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ కారిడార్ తరహాలో, నగరానికి మరో గ్రోత్ కారిడార్‌కు సర్కారు తెరలేపింది. ఈ క్రమంలో రీజనల్ రింగు రోడ్డు వెంబడి మరో రెండు కిలోమీటర్ల వెడల్పుతో నూతనంగా గ్రోత్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై ఉన్నత స్థాయిలో సమీక్షించిన సర్కారు.. హెచ్ఎండీఏకు అప్పగించనున్నది. ఇటీవల 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించిన నేపథ్యంలో… ట్రిపులార్ వరకు ఉన్న ప్రాంతాలన్నీ కలిశాయి. దీంతో కొత్తగా ఏర్పాటైన ప్రాంతాలు, రీజనల్ రింగు రోడ్డు వెంబడి గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలను ఇకపై హెచ్ఎండీఏ నిర్వహించనున్నది.
7 ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాల విస్తరించిన హెచ్ఎండీఏలో పాలనపరమైన చర్యలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏలోనూ పాలన వికేంద్రీకరణకు అనువుగా ఉండేలా పెరిగిన కొత్త పరిధి విభజన చేస్తున్నారు. ఇప్పటికే కొత్త పరిధికి అనుగుణంగా జోన్ల పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు చేస్తుండగా, జోన్ల ఏర్పాటు తర్వాత కొత్తగా గ్రోత్ కారిడార్‌ను కూడా నిర్ధారించనున్నారు. దీనికోసం జోన్ల వారీగా ఉన్న పరిధి, ట్రిపులార్ విస్తరించి ఉన్న కిలోమీటర్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న గ్రోత్ కారిడార్‌ను 2 కిలోమీటర్ల వెడల్పుతో ఖరారు చేయనున్నారు.
ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాకుండా, న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కొంటున్న ట్రిపులార్ విషయంలో గ్రోత్ కారిడార్‌ను నిర్ధారణ చేయడం ద్వారా రియాల్టీకి కార్యకలాపాలను పెరగడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే 11 జిల్లాల పరిధిలో ఉన్న ట్రిపులార్ చుట్టూరా గ్రోత్ కారిడార్‌ను ఏర్పాటు చేసి, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు రూపొందించేందుకు వీలుగా వికేంద్రీకరణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో అందుబాటులోకి వచ్చే ల్యాండ్ బ్యాంక్‌తో భూముల వేలం, కొత్త వెంచర్ల అభివృద్ధి, భవన నిర్మాణ అనుమతులు రూపంలో ఆదాయ వనరులకు ఆస్కారం ఉంటుందని సర్కారు అంచనా వేస్తోంది.