సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా తీసుకువచ్చిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వ హయంలో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5937 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అప్పట్లోనే 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగా.. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పురోగతిలో ఉన్న పనులను తుది దశకు చేర్చి ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన సంతోష్ నగర్, చంచల్‌గూడ, సైదాబాద్ మీదుగా ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి లభించనుంది. ప్రస్తుతం పీక్ అవర్స్‌లో అరగంట పడుతున్న ప్రయాణ సమయం, ఈ నల్లగొండ స్టీల్ బ్రిడ్జి ఫె్లైఓవర్ అందుబాటులోకి వస్తే కేవలం 5 నిమిషాల్లోనే సులభంగా పూర్తి కానుందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తెలిపారు.
చంచల్‌గూడ జైలు కూడలి నుంచి సంతోష్ నగర్ వరకు రూ.620 కోట్ల భారీ వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ మెగా స్టీల్ ఫె్లైఓవర్ పనులు రాత్రింబవళ్లు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో ఎదురైన భూసేకరణ, నిధుల సమస్యలను అధిగమించి, జీహెచ్ఎంసీ ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పెంచింది. ఈ ఫె్లైఓవర్కు సంబంధించిన మొత్తం 85 పిల్లర్లలో ఇప్పటికే 78 పిల్లర్లపై స్లాబ్ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇదే సమయంలో ఎగువ, దిగువ ర్యాంపు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టు పనులు 90 శాతం మేర ముగిశాయి. ఈ నెలాఖరులోగా ఈ వంతెనను ప్రజా రవాణాకు సిద్ధం చేస్తామని సీఈ సహదేవ్ రత్నాకర్ స్పష్టం చేశారు. ఈ ఫె్లైఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగొండ ఎక్స్‌రోడ్స్ నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకు ఉన్న మూడు ప్రధాన సిగ్నల్స్ బాధ తప్పనుంది, తద్వారా 90 శాతం ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని అధికారులు భావిస్తున్నారు.