సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : నిబంధనలు పాటించకుండా విద్యాసంస్థల యజమానులు రవాణా శాఖను బురిడీ కొట్టిస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేని బస్సులను యథేచ్ఛగా రోడ్లపై నడుపుతున్నారు. ప్రమాదమని తెలిసినా.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ జీతంలో డ్రైవర్లను నియమించి.. బస్సులను నడిపిస్తున్నారు. అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్న విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు నిఘా వేశారు. బృందాలుగా ఏర్పడి స్కూల్స్ జోన్స్లో తనిఖీలు చేపట్టారు.
గ్రేటర్లో ఫిట్నెస్లేని 27 బస్సులను గుర్తించి సీజ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారని తెలిసినా.. ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలించడం కొన్ని విద్యాసంస్థల నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది. కాగా, అధికారులు రెండ్రోజుల్లో రూ.30 లక్షల జరిమానా వసూలు చేశారు. వంద బస్సులను సీజ్ చేశారు. కాగా, 60% వరకు ఫిట్నెస్ లేని బస్సులు గ్రేటర్లో ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. వాటన్నింటినీ తనిఖీ చేస్తే ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందన్నారు.విద్యాసంస్థల బస్సుల విషయంలో అధికారులు పకడ్బందీగా తనిఖీలు చేస్తే అటు ప్రభుత్వానికి, ఇటు పిల్లల ప్రాణాలకు శ్రేయస్కరమని విద్యావేత్తలు చెబుతున్నారు.