హిమాయత్‌నగర్,ఆగస్టు4 : దేశంలోని ఆదివాసీ, గిరిజనుల ఖనిజా సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పన్నంగా కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్ ఆరోపించారు. సోమవారం హిమాయత్ నగర్లో సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు, గిరిజనుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు.
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం అమాయక ఆదివాసీలను అంతం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న రూ.216 కోట్లు ట్రైకార్ రుణాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ గిరజన దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో నేతలు పల్లా నర్సింహరెడ్డి, రమేష్, కుటుంబరావు, ఆర్.శంకర్ నాయక్, స్వరూప నాయక్ పాల్గొన్నారు.