సిటీ బ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతున్నాయి. పిల్లలకు ప్రీస్కూల్ విద్య అందించాల్సిన సెంటర్లు అచేతన స్థితిలోకి వెళ్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనలో అంగన్వాడీ కేంద్రాలు దిశ దశ లేకుండా తయారవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలకే పరిమితమైంది. నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రెండేండ్లుగా ప్రకటిస్తూనే ఉన్నారు.
కానీ ఆమె ప్రకటనలు రెండేండ్లుగా కార్యరూపం దాల్చడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల అంగన్వాడీ కేంద్రాలు సుప్తావస్థకు చేరుకుంటున్నాయి. దీనికి తోడు సొంత భవనాలు లేకపోవడం, అద్దె సరిగ్గా చెల్లించకపోవడం, నాసిరకం ఆహార పదార్థాలు పంపిణీ చేయడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రజాపాలనలో అంగన్వాడీల సమస్యలను తీర్చడంపై ప్రకటనలే తప్ప కార్యరూపం దాల్చకపోవడంతో నగరంలోని సెంటర్లలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సిబ్బంది కొరత ఉండటంతో ఉన్న కొద్దిమంది పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి ఎన్నిసార్లు నిరసన తెలిపినా ఎలాంటి చలనం లేదు. ఇప్పటికైనా తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి, ఖాళీలను భర్తీ చేయాలని అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు కోరుతున్నారు.
పనిభారంతో టీచర్లకు ఇక్కట్లు..
హైదరాబాద్లో మొత్తం 970 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 183 సెంటర్లలో టీచర్లు లేరు. 402 సెంటర్లలో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు లేని కేంద్రాలకు ఇతర సెంటర్ల టీచర్లను ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. ఇలా చేయడం వల్ల అటు సొంత సెంటర్లో ఇటు ఇన్చార్జిగా ఉన్న సెంటర్లో పూర్తిస్థాయిగా విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో కొన్నిసార్లు ఒక సెంటర్ మూసేసి, మరో దాంట్లో విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. రెండు కేంద్రాలకు రాకపోకలు సాగించడానికి అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థికంగా, మానసికంగా అవస్థలు పడాల్సి వస్తుంది. నగరంలోని దాదాపు సగం కేంద్రాల్లో హెల్పర్లు లేకపోవడంతో వారి పనికూడా టీచర్లే చేయాల్సి వస్తున్నది. రెండు పనులు ఒక్కరే చేయాలంటే మరింత భారంగా మారుతున్నది. పిల్లలను చూసుకోవడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహార పదార్థాలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఖాళీలను భర్తీ చేస్తామన ప్రకటనలకే పరిమితమయ్యారు.
హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్..
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. వేతనాన్ని రూ.13,600 నుంచి రూ. 18,500కు పెంచుతామన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రతి మీటింగ్లో గొప్పలు చెప్పారు. ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను మభ్యపెట్టి వారి జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నది. మినీ అంగన్వాడీలను పెద్ద కేంద్రాలుగా మర్చి చేతులు దులుపుకున్నారు.
అందులో పనిచేసిన వారి పెండింగ్ జీతాలు మాత్రం చెల్లించకుండా వేధిస్తున్నారు. కాంగ్రెస్ తమకిచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం, మంత్రులను ఎన్నిసార్లు కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదు. అన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, హెల్పర్లు సచివాలయం ముట్టడికి యత్నిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.