సిటీబ్యూరో, జనవరి 6(నమస్తే తెలంగాణ): పట్టపగలు ఇంట్లోకి చొరబడ్డ అగంతకులు ఓ వృద్ధురాలిని నిర్బంధించి గంటకుపైగా ఆ ఇంట్లో గడిపి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 11తులాల బంగారు నగలను అపహరించారు. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కొడుకు లండన్‌లో ఉంటుండగా వృద్ధురాలు ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న వారే ఈ ఘటనకు పాల్పడ్డారు. వృద్ధురాలి రోధనలతో స్పందించిన స్థానికులు ముగ్గురు సభ్యులున్న ముఠాలో ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
ముఠాలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు బాధితురాలు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్‌లోని పద్మానగర్‌లో ఉండే సుగుణమ్మ (68) కొడుకు లండన్‌లో నివాసముంటుండగా ఆమె ఒంటరిగా నివాసముంటున్నది. ఇటీవల ఆ మె కొడుకు లండన్ నుంచి వచ్చి, వ్యాపారం పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుంది.కాగా మంగళవారం మధ్యాహ్నం ఒక మహిళ ఇంట్లోకి వచ్చి ఆమెతో మాట్లాడింది. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి ఆమె వద్ద ఉన్న స్ప్రే తీసుకొని వృద్ధురాలి ముఖంపై చల్లి, బయట ఉన్న తమ ఇద్దరు అనుచరులకు ఇంట్లోకి రావచ్చంటూ సిగ్నల్ పంపించింది.
ఆ తరువాత ఆమె ఆరుస్తుంటే ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు నిర్బంధించి ముఖానికి పిల్లో(మెత్త) అడుపెట్టి అరవకుండా చేశారు. మరో మహిళ ఇంట్లో ఉన్న బీరువాలను వెతకడం ప్రారంభించింది. గంటకుపై ఇంట్లోని అన్ని ప్రాంతాలు వెతికి బీరువా తాళాలు ఆమె వద్ద నుంచి లాక్కున్నారు. బీరువా తెరిచి చూడగా అందులో ఉహించినంత ఆభరణాలు కనిపించలేదు. బీరువాలోని లాకర్ తెరిచేందుకు శతవిధాల ప్రయత్నించారు, అది ఓపెన్ కాకపోవడంతో వృద్ధురాలిని చితక బాధి, లాకర్ తాళాలు ఎక్కడున్నాయంటూ బెదిరించారు. లాకర్ తాళాలు తన వద్ద లేవని వృద్ధురాలు చెప్పగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు సుమారు 11 తులాల వరకు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
దోపిడీ దొంగలు టీవీ సౌండ్‌ను పెద్దగా పెట్టడంతో ఆమె అరుపులు బయటకు వినపడలేదు. దొంగలు పరారు కావడంతోనే ఆమె బయటకు వచ్చి పెద్దగా అరిచింది. ఇరుగుపొరుగు వారు వెంటనే తేరుకొని అక్కడకు చేరుకొని జరిగిన విషయం తెలుసుకొని దోపడీ దొంగల కోసం కాలనీలో గాలింపు చేపట్టడంతో ముగ్గురు దొంగల్లో ఒక మహిళ సమీపంలోని ఒక ఇంట్లో గోడ దూకి బాత్రూంలో దాక్కుంది. దీంతో స్థానికులు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటన విషయం తెలుసుకొని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సీఐ సైదిరెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు.