Vehicle Registrations | సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ) : అదనపు ఆదాయం కోసం ఆర్టీఏ పాకులాడుతోంది. ప్రజా సేవల చార్జీలను ఇష్టానుసారంగా పె ంచేసి చోద్యం చూస్తున్నది. లెర్నింగ్, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, పర్మిట్స్ తదితర అన్ని ట్రాన్సక్షన్స్‌కు సంబంధించి సర్వీస్ చార్జీలను పెంచేసి వాహనదారుడి నడ్డి విరుస్తోంది. రవాణా శాఖ తాజా నిర్ణయాలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడక తప్పదు అనేలా ఉంది పరిస్థితి. రవాణాశా అతీగతీ లేని నిర్ణయాలు.. కొత్త బండి కొనుగోలు చేయాలనే మధ్యతరగతి వారి ఆలోచనలను వాయిదా వేసుకునేలా చేస్తున్నాయి.
అదనపు ఆదాయమే లక్ష్యంగా రవానా శాఖ తాజాగా విడుదల చేసిన జీఓ 51తో.. బండి ధర ఆధారంగా సర్వీస్ చార్జి వసూలు చేస్తున్నారు. ఎంత ధరగల ద్విచక్రవాహనమైనప్పటికీ.. గతంలో ఆర్సీ సర్వీస్ చార్జి రూ.200 ఉండేది. ఇప్పుడు దానికి బదులు బండి ధరపై 0.5 శాతం చార్జి పడనుంది. లక్ష రూపాయల ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే గతంలో ఆర్సీ సర్వీస్ చార్జి 200 రూపాయలు ఉండేది… ఇప్పుడు బండి ధరపై రూ.500 వరకు పెంచేశారు.
ఇలానే కార్లకు గతంలో రూ.400 సర్వీస్ చార్జి ఉండగా ఇప్పుడు కారు ధరపై 0.1 శాతం చార్జి వసూలు చేస్తున్నారు. అంటే కోటి రూపాయల కారుకు రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ చార్జ్జిలను ఇష్టానుసారంగా పెంచడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల ఆధారంగా ఉండాల్సిన ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల నుంచి ఆదాయాన్ని పెంచుకునేల ఉండటం సరైన విధానం కాదని చెబుతున్నారు.
ఆర్టీఏ తాజా సర్వీస్ చార్జీలు ఇలా..!
ట్రాన్సాక్షన్ : సర్వీస్ చార్జి
ద్విచక్రవాహనం (ఆర్సీ) : 0.5 శాతం (బైక్ ధర ఆధారంగా)
ఫోర్ వీలర్ (ఆర్సీ) : 0.1 శాతం ( వాహన ధర ఆధారంగా)
త్రీవీలర్ (ఆర్సీ) : రూ.300
లెర్నింగ్ లైసెన్స్ : రూ.200
లైట్ మోటార్ వెహికల్ : రూ.300
నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ : రూ.400
విమర్శలపాలవుతున్న ఆర్టీఏ..!
ఇటీవల తీసుకొచ్చిన రెండు జీఓలపై వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశాఖ ఇటీవల జీవో 263 జారీ చేసింది. నగరంలో పర్యావరణ కాలుష్యాన్ని పట్టించుకోకుండా 20 వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చింది. అందులో పదివేలు సీఎన్జీ, మరో పదివేలు ఎల్పీజీ ఆటోలకు ఓకే చెప్పింది. అయితే నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ లోపల పెట్రోల్, డీజిల్ ఆటోలను రద్దు చేస్తామని నిర్ణయించారు.
కానీ రవాణా శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. పెట్రోల్, డీజిల్‌తో కూడిన ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలను డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు. దీనిపై పర్యావరణ నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు జీఓ 51తో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుతున్న పరిస్థితుల్లో సర్వీస్ చార్జి పేరుతో అదనంగా రుసుం వసూలు చేయడాన్ని వాహనదారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గ్రేటర్లో అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు సంబంధించి సుమారు 1700 వాహనాల వరకు ఒక రోజుకు రిజిస్ట్రేషన్ అవుతాయి. సర్వీస్ చార్జి పేరుతో సుమారు రెండు కోట్ల్ల వరకు ఆదాయం సమకూర్చుకోనుంది.