Hyderabad | అమీర్‌పేట్, ఏప్రిల్ 8 : మరో వారం రోజుల్లో ప్రసవించనున్న ఓ గర్భిణికి ఎవరూ ఊహించని పరిస్థితి ఎదురైంది. గర్భసంచికి అతుక్కుని ఉండాల్సిన ”మాయా” విడిపోయి తీవ్రరక్త స్రావ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను హుటాహుటిన అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రసవం తరువాత గర్భసంచి నుండి వేరుకావాల్సిన మాయా, ప్రసవానికి వారం రోజుల ముందే వేరుకావడంతో… శిశువుతో పాటు తల్లికి కూడా ప్రాణాపాయం ఉన్నట్టు గ్రహించిన ఇక్కడి గైనిక్ వైద్య బృందం, పెద్దాసుపత్రికి తరలించే సమయం కూడా లేకపోవడంతో, కేవలం 8 నిమిషాల్లో అత్యవసర శస్త్రచికిత నిర్వహించి తల్లితో పాటు శిశువు ప్రాణాలను కాపాడారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలానగర్‌కు చెందిన నెలలు నిండిన గర్భిణి యాస్మిన్ (23) ఈ నెల 5న ఉదయం 10 గంటలకు అమీర్‌పేట్‌లోని 50 పడకల సీహెచ్‌సీకి చేరింది. అత్యవసర కేసుగా పరిగణిస్తూ, ఇక్కడి గైనిక్ బృందం యాస్మిన్‌కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భసంచికి అతుక్కుని ఉండాల్సిన ”మాయా” విడిపోవడమే రక్త స్రావానికి కారణమనే విషయాన్ని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఇక్కడి నుండి నీలోఫర్ వంటి పెద్దాసుపత్రికి తరలించేంత సమయం కూడా లేకపోవడంతో, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహ్మద్ రవూఫ్, ఆర్ఎంవో డాక్టర్ వినాయక్ కూడా అనుమతించడంతో ఇక్కడి గైనిక్ బృందం ఆనస్థీషియా, పీడియాట్రిక్ విభాగం వైద్యులతో కలిసి కేవలం 8 నిమిషాల్లో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, తల్లితో పాటు శిశువును కాపాడారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు పూర్తిగా కోలుకున్నారు. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల బృందంతో కలిసి తల్లీబిడ్డలను పరీక్షించిన అనంతరం వారు పూర్తి స్థాయిలో వసతులు లేకున్నా… ధైర్యంతో శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు.